తెలంగాణ

ఓటింగ్‌కు దూరంగా ఆ గ్రామాలు..

హైదరాబాద్‌: ఓవైపు తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతుండగా కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. సమస్యలు పరిష్కరించేంతవరకు ‘మేం ఓటు వెయ్యం’ అని కరాఖండీగా చెబుతున్నారు. వికారాబాద్‌లోని అనంతగిరిపల్లి తాండ, మెదక్‌లోని అవుసులపల్లి గ్రామ వాసులు ఉదయం నుంచి పోలింగ్‌ కేంద్రాలకు రాకపోవడంతో అక్కడి అధికారులు ఓటర్లకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని అనంతగిరిపల్లి తాండ ప్రజలు ఓటింగ్‌ను బహిష్కరించారు. తాగునీటి సమస్య తీర్చాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ‘ముందు సమస్యను పరిష్కరించండి. అప్పుడే ఓటేస్తాం. లేదంటే ఓటు వేయం’ అని ఓటర్లు తేల్చిచెప్పారు. అటు మెదక్‌ మండలం అవుసులపల్లి ఉపాధి హామీ కూలీలు కూడా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. తమ గ్రామాన్ని పురపాలికలో విలీనం చేయడంతో తామంతా నష్టపోతున్నామని, అందుకే ఓటు వేయకుండా నిరసన తెలుపుతున్నామని కూలీలు తెలిపారు.

ఇక నారాయణపేట జిల్లా మరికల్‌ మండలం తీలేరు గ్రామస్థులు కూడా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. బుధవారం గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనుల్లో మట్టిదిబ్బలు విరిగిపడి 10 మంది కూలీలు మృతిచెందిన విషయం తెలిసిందే. వారి మృతితో గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.  దీంతో గ్రామస్థులు ఓటు వేసేందుకు ఆసక్తి చూపించట్లేదు.