తెలంగాణ

ఓటర్లకు ‘సెల్‌ఫోన్’ చిక్కులు

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లకు సెల్‌ఫోన్‌ చిక్కులు ఎదురవుతున్నాయి. పోలింగ్‌ కేంద్రాల్లోకి మొబైల్‌ తీసుకెళ్లేందుకు పోలీసులు అనుమతించడం లేదు. దీంతో వాటిని ఎక్కడ పెట్టాలో తెలియక ఓటర్లు నానా అవస్థలు పడుతున్నారు.

ఓటు వేస్తూ సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటున్న ఘటనలు గత ఎన్నికల సమయంలో వెలుగుచూడటంతో పోలింగ్‌ కేంద్రాల్లోకి మొబైల్‌ను తీసుకెళ్లేందుకు ఎన్నికల అధికారులు అనుమతించడం లేదు. అయితే దీనిపై ఎన్నికల సంఘం ముందస్తుగా ప్రచారం చేయలేదు. చాలామందికి దీనికి సంబంధించిన సమాచారం తెలియదు. దీంతో ఉదయాన్నేఓటు వేసి వెళదామని పోలింగ్‌ బూత్‌లకు చేరుకున్న ఓటర్లు ఇబ్బందికి గురయ్యారు.

‘ఈ నిబంధన మంచిదే కావచ్చు. కానీ ఫోన్లను భద్రపరిచేందుకు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేస్తే బాగుండేది. కనీసం ఎన్నికల సంఘం ఫోను తీసుకురావద్దని ప్రచారం చేసినా బాగుండేది’ అని ఓటు వేసేందుకు వచ్చి ఇబ్బంది పడుతున్న పలువురు వ్యాఖ్యానించారు. అసలే ఈవీఎంల మొరాయింపుతో పలుచోట్ల ఉదయం రెండు, మూడు గంటలు దాటినా పోలింగ్‌ మొదలుకాలేదు. దానికితోడు సెల్‌ఫోన్‌ చిక్కులతో కొన్నిచోట్ల పోలింగ్‌ నెమ్మదిగా సాగుతోంది.