తెలంగాణ

‘ఓటమి భయం చంద్రబాబులో కనిపిస్తోంది’

హైదరాబాద్‌ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తీవ్ర విమర్శలు చేశారు. ప్రచారం పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో తలసాని మీడియాతో  మాట్లాడారు. ఏపీలో పోలింగ్‌ శాతం బాగుందని అన్నారు. ప్రచారం ముగిసిన తర్వాత నేతలు ఎక్కువగా మాట్లాడకూడదని..చంద్రబాబు మాత్రం పబ్లిసిటీ కోసం పోలింగ్‌కు ముందు రోజు ఈసీని కలిశారని విమర్శించారు. పోలింగ్‌ రోజు కూడా ఓటు వేయాలని వీడియో విడుదల చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని పేర్కొన్నారు.

‘చంద్రబాబు ప్రసంగాల్లో ఒకమాటకు ఇంకోమాటకు పొంతన ఉండదు. సెల్‌ఫోన్‌ నేనే కనిపెట్టానని, టెక్నాలజీని నేనే తీసుకువచ్చానని ప్రచారం చేసుకునే చంద్రబాబు ఈవీఎంలు వద్దనడం హాస్యాస్పదం. పోలింగ్‌లో సాంకేతిక కారణాలతో ఈవీఎంలు మొరాయించడం సర్వసాధారణం. 46 వేల ఈవీఎంలు వాడిన చోట 300 ఈవీఎంలలో సమస్య రావడం చిన్న విషయం. ఓడిపోతున్నామనే భయం, అసహనం చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తోంది. తండ్రిలాగే కుమారుడు మంగళగిరిలో నాటకాలు ఆడారు’ అని తలసాని విమర్శించారు.