జాతీయం

ఒత్తిడిలో ఎలా కొట్టానో నాకే తెలియదు

బెంగళూరు: రసెల్‌..నిన్నటి మ్యాచ్‌ను అనూహ్యంగా మలుపు తిప్పిన కోల్‌కతా ఆటగాడు. సిక్సర్ల మోత మోగించి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు విజయాన్ని అందించాడు. 13 బంతుల్లో 48 పరుగులు చేసి కోహ్లీ జట్టు ఖాతా తెరవకుండా అడ్డుకున్నాడు. దీంతో రసెల్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆఖర్లో ఇతడి వీర బాదుడు పట్ల సీనియర్‌ క్రికెటర్లు సైతం అభినందనలు కురిపిస్తున్నారు
దీనిపై రసెల్‌ మాట్లాడుతూ…‘ నేను బ్యాటింగ్‌కు దిగేటప్పుడు నమ్మకంతోనే ఉన్నా. పిచ్‌ను బట్టి నడుచుకోమని నాకు దినేశ్‌ కార్తిక్‌ సలహా ఇచ్చాడు. ఎదురుగా స్కోరు చూసే కొద్దీ నాలో భయం మొదలైంది. 20 బంతుల్లో 68 పరుగులు చేయాలని అప్పుడే అర్థమైంది. ఇలాంటి రోజు నాకు ఎప్పుడూ ఎదురు కాలేదు. అప్పుడే నాలో నేను ఆలోచించుకుని ఏకాగ్రత పెంచుకున్నాను. ఒత్తిడిలో ఎలా కొట్టానో నాకే తెలీదు. టీ20ల్లో ఆటగాళ్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వడం సహజం. నచ్చిన విధంగా ఆడటానికి నాకు జట్టులో స్వేచ్ఛ ఉంది. దినేశ్‌ నాకా స్వేచ్ఛ ఇచ్చాడు. అంతేకాకుండా జట్టులో ప్రతి ఒక్క ఆటగాడూ నన్ను ప్రోత్సహిస్తారు. కాబట్టే నేను ఏకాగ్రతతో ఆడగలుగుతున్నాను’అని చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్‌లో భాగంగా శుక్రవారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు-కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాధించింది.  5 వికెట్ల తేడాతో బెంగళూరు జట్టుపై గెలుపొందింది.