ఆంధ్రప్రదేశ్క్రైమ్

ఒక్క మీట నొక్కితే చాలు..!

అమరావతి: మహిళల భద్రతకు ఏపీఎస్‌ఆర్టీసీ పెద్దపీట వేస్తోంది. మహిళలకు బస్సుల్లో ఇప్పటికే  ప్రత్యేక సీట్టు కేటాయించిన ఆర్టీసీ.. వారి భద్రత కోసం చర్యలు చేపడుతోంది. రద్దీగా ఉండే సిటీ బస్సుల్లో ముందు భాగంలో కేవలం మహిళలకే సీట్లు కేటాయించారు. దూరప్రాంత సర్వీసుల్లో మహిళల పక్క సీట్లలో వారికే కేటాయిస్తున్నారు. దీనివల్ల ప్రయాణాల్లో పోకిరీల కారణంగా తలెత్తే ఇబ్బందులు తప్పాయి. ఆపద సమయంలో సమాచారం తెలియజేసేందుకు హెల్ప్‌ లైన్‌ నంబర్లను ఏర్పాటు చేశారు. తాజాగా దూర ప్రాంత బస్సుల్లో నిఘా కెమేరాలను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ఇటీవల ప్రవేశపెట్టిన వెన్నెల స్లీపర్‌, గరుడ, ఇంద్ర, అమరావతి, నైట్‌ రైడర్‌, ఎక్స్‌ప్రెస్‌ వంటి మెట్రో లగ్జరీల్లో మొత్తం 186 బస్సుల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేసి భద్రత పెంచారు. ఒక్కొ దశలో రూ.16 కోట్ల చొప్పున మొత్తం రూ.48 కోట్లతో  అన్ని బస్సుల్లో నిఘా కెమేరాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ప్రయాణ సమయంలో ఆపదలో ఉన్నవారిని రక్షించడంపైనా ఆర్టీసీ దృష్టి సారించింది. జీపీఎస్‌ ఆధారంగా పనిచేసే ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది. బస్సుల్లో పలు చోట్ల ప్యానిక్‌ బటన్లు ఏర్పాటు చేసి జీపీఎస్‌ ద్వారా పోలీస్‌ కంట్రోల్‌ రూంకి అనుసంధానించే అధునాతన వ్యవస్థను ఆర్టీసీ ఐటీ విభాగం గత కొన్ని రోజులుగా  పరిశీలిస్తోంది. ఇది అమల్లోకి వస్తే  ప్యానిక్‌ బటన్‌ నొక్కితే చాలు కంట్రోల్‌ రూంకి ఫోన్‌ వెళ్తోంది. జీపీఎస్‌ ఆధారంగా సమీపంలోని పోలీసులకు, ఆర్టీసీ అధికారులకు సమాచారం చేరుతుంది. వెంటనే సంబంధిత సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సాయం అందిస్తారు. పానిక్‌ బటన్‌ సాంకేతికతలో కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి పూర్తిస్థాయిలో పరిష్కారమైతే దశలవారీగా వాటిని అమల్లోకి తీసుకురానున్నారు.