అంతర్జాతీయం

ఒకే కుటుంబంలోని ఏడుగురిపై కాల్పులు

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆ దేశ రాజధాని కాబూల్‌లో సోమవారం తెల్లవారు జామున ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు ఆ కుటుంబంలోని ఏడుగురిపై కాల్పులు జరిపి, వారి ప్రాణాలను తీశాడు. మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని సోమవారం అధికారులు మీడియాకు తెలిపారు. కాబూల్‌లోని కర్త్‌ ఎ సాఖి ప్రాంతంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుందని వివరించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని తెలిపారు.

ఈ ఘటనపై బాధితుల బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఆ కుటుంబానికి కొందరితో భూ వివాదాలు ఉన్నాయని పోలీసులు తెలుసుకున్నారు. అయితే, వీరి హత్యలకు ఈ విభేదాలే కారణమా? అన్న విషయం గురించి తెలియరాలేదని పేర్కొన్నారు. అలాగే, ఆ ఇంట్లో ఎటువంటి చోరీ జరగలేదని తెలిపారు. ఉగ్రదాడులతో భయం గుప్పిట ప్రజలు జీవనం సాగిస్తున్న అఫ్గాన్‌ ప్రజలకు మరో తీవ్ర సమస్యను కూడా ఎదుర్కొంటున్నారు. భూ వివాదాల వల్ల ఆ దేశంలో తరుచూ ఇటువంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.