అంతర్జాతీయంక్రీడలు

ఒకప్పటి క్రికెటర్‌ .. ఇప్పుడు టెన్నిస్‌ స్టార్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: పడిలేచిన కెరటంలా ఆసిస్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ఎనిమిదో సీడ్‌ ఆష్లీ బార్టీ సంచలన విజయం సాధించి ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే.  6-7 (4-7), 6-3, 6-3 తేడాతో అనిసిమోవాపై గెలిచి ఫైనల్లో అడుగెట్టింది. శనివారం వొంద్రుసోవాతో తొలి గ్రాండ్‌స్లాం సింగిల్స్‌లో తలపడనుంది. బార్టీ ఇదివరకే నాలుగు సింగిల్స్‌ టైటిల్స్‌తో పాటు  పది డబుల్స్‌ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. అందులో 2018 యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిట్‌ కూడా ఆమె ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉండగా బార్టీ టెన్నిస్‌ ఆడుతూనే మధ్యలో విరామం తీసుకుంది. ఆ సమయంలోనే ఆస్ట్రేలియా మహిళల జాతీయ జట్టుతో పరిచయమై ఆమె క్రికెట్‌ వైపు అడుగులేసింది. తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు  2015లో క్వీన్స్‌లాండ్‌ క్రికెట్‌ బోర్డుని సంప్రదించి క్రికెట్‌లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలోనే ఆమె వెస్టర్న్‌ సబర్బ్స్‌ డిస్ట్రిక్ట్స్‌  క్లబ్‌ తరఫున బ్యాట్‌ పట్టి మంచి పేరు తెచ్చుకుంది. అనంతరం మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో అడుగుపెట్టి సత్తా చాటింది. అలా కొద్ది కాలం క్రికెట్‌ ఆడి బిగ్‌ బాష్‌ లీగ్‌ అనంతరం మళ్లీ టెన్నిస్‌ రాకెట్‌ పట్టింది.