క్రీడలు

ఐసీసీ టోర్నీ… అయితే ‘గబ్బర్‌’ ఆగయా!

దిల్లీ బాద్షా

ప్రపంచకప్‌ ముందు జరిగిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 12వ సీజన్లో గబ్బర్‌ ప్రదర్శన మెరుగ్గానే ఉంది. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన ధావన్‌ను ఈసారి ట్రేడ్‌ఆఫ్ ద్వారా దిల్లీ క్యాపిటల్స్‌ సొంతం చేసుకుంది. చాన్నాళ్ల తర్వాత సొంతగడ్డకు ఆడిన అతడు సీజన్లో 16 ఇన్నింగ్సుల్లో 521 పరుగులు సాధించాడు. ఆరెంజ్‌ క్యాప్‌ పోటీలో నాలుగో స్థానంలో నిలిచాడు. ధావన్‌ 34.73 సగటు, 135.67 స్ట్రైక్‌రేట్‌తో ఐదు అర్ధశతకాలు సాధించాడు. 97* అత్యధిక స్కోరు. తన అనుభవంతో కుర్ర దిల్లీకి అండగా నిలిచాడు. కొన్ని మ్యాచుల్లో విఫలమైనా మిగతా మ్యాచుల్లో జట్టు విజయాల్లో కీలకమయ్యాడు. తన ఉద్దేశంలో ప్రపంచకప్‌ కోసం ఇంగ్లాండ్‌కు సంతోషంగానే పయనం అవుతున్నాడు. ఆడినా.. ఓడినా.. ఎప్పుడూ ప్రతికూలంగా ఉండనన్నది గబ్బర్‌ మాట.

ఐసీసీ గబ్బర్‌

ధావన్‌ ఎడమచేతి వాటం, రోహిత్‌ కుడిచేతి వాటం కూర్పును టీమిండియా సద్వినియోగం చేసుకుంటోంది. ఓపెనర్లు ఇద్దరూ మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పేందుకూ ఇది సాయపడుతోంది. ఐసీసీ టోర్నీల్లోనూ ఇదే జరుగుతోంది. ఇప్పటి వరకు ధావన్‌ ఐసీసీ టోర్నీల్లో 18 మ్యాచులు ఆడాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీ రెండు సార్లు, ప్రపంచకప్‌ ఒకసారి ఆడాడు. వీటిలో 97.71 స్ట్రైక్‌రేట్‌, 65.47 సగటుతో 1113 పరుగులు సాధించాడు. అందులో ఐదు శతకాలు, నాలుగు అర్ధశతకాలూ ఉన్నాయి. ఇక ఇంగ్లాండ్‌లో ఆడిన 17 వన్డేల్లో 65.06 సగటు, 101.03 స్ట్రైక్‌రేట్‌తో 3 శతకాలు, 4 అర్ధశతకాలు, 976 పరుగులు చేయడం కోహ్లీసేనకు ఆనందాన్నిచ్చే అంశం. 2019 ప్రపంచకప్‌ సైతం ఇంగ్లాండ్‌లోనే జరుగుతున్న సంగతి తెలిసిందే.

రావడం రావడమే..

నిలకడ లోపం, ఫామ్‌లేమితో దాదాపు రెండేళ్లు టీమిండియాకు దూరమయ్యాడు ధావన్‌. 2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీతో పునరాగమనం చేశాడు. రావడం రావడమే కార్డిఫ్‌లో దక్షిణాఫ్రికాపై రెచ్చిపోయాడు. 94 బంతుల్లో 114 పరుగులతో విజృంభించాడు. చేతి-కంటి మధ్య చక్కని సమన్వయం, టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. చాలా అరుదుగా బంతిని గాల్లోకి పంపించాడు. ఎక్కువగా బంతి నేలకు ముద్దాడేలాగే ఆడాడు. 80 బంతుల్లోనే శతకం చేసేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ గబ్బర్‌ 102 బంతుల్లో 107 బాదేసి ఆకట్టుకున్నాడు. ధోనీసేన విజేతగా నిలిచిన ఈ సిరీస్‌లో అతడు 5 ఇన్నింగ్సుల్లో 90.75 సగటు, 101.40 స్ట్రైక్‌రేట్‌తో 363 పరుగులతో అందరి కన్నా మిన్నగా నిలిచాడు. ఆ తర్వాత జట్టుకు దూరం కాలేదు.

ప్రపంచ కప్‌ పోటీలోనూ..

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో నిర్వహించిన 2015 ప్రపంచకప్‌లోనూ శిఖర్ ధావన్‌ భారత్‌ తరఫున అత్యధిక పరుగులు చేశాడు. మెల్‌బోర్న్‌లో దక్షిణాఫ్రికాపై 146 బంతుల్లో 137 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా 307/7 లక్ష్యం నిర్దేశించింది. సఫారీ జట్టుపై 130 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐర్లాండ్‌పైన గబ్బర్‌ రెండో శతకం అందుకున్నాడు. ఇక మిగతా స్కోర్లు 73, 14, 9, 4,30, 45. మొత్తం 412 పరుగులతో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. రెండేళ్ల తర్వాత ఇంగ్లాండ్‌లో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీలోనూ గబ్బరే పరుగుల వీరుడు. 68, 125, 78, 46, 21తో భారత్‌ ఫైనల్‌ చేరడంలో కీలకమయ్యాడు. 67.6 సగటుతో 338 పరుగులు చేసి మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. అందుకే 2019 ప్రపంచకప్‌లోనూ అతడు ఇలాగే ఆడాలని అందరూ కోరుకుంటున్నారు.