జాతీయం

ఐపీఎల్‌ నుంచి మెరుగైన బౌలర్‌గా వెళ్తా…

దిల్లీ: ప్రస్తుత ఐపీఎల్‌లో తన పదునైన ఇన్‌స్వింగర్లతో ఇంగ్లాండ్‌ యువ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌ మంచి పేరు తెచ్చుకున్నాడు. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ శిబిరంలో కీలక ఆటగాడిగా మారిపోయాడు. సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమి, రవిచంద్రన్‌ అశ్విన్‌, కేఎల్‌ రాహుల్‌ వద్ద విలువైన సలహాలు పొందుతున్నాడు. వేలంలో రూ.7.2 కోట్లు పలికిన కరన్‌ ఈ సీజన్‌లో హ్యాట్రిక్‌ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు.

‘ఇది నా తొలి ఐపీఎల్‌. ఉపఖండం పరిస్థితుల్లో వేలాది మంది అభిమానుల మధ్య ఆడటం చాలా బాగుంది. జట్టులోని సీనియర్‌ ఆటగాళ్ల నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ఇక్కడికొచ్చే ముందు ఇంగ్లాండ్‌ ఆటగాళ్లలో కొందరిని సంప్రదించా. టోర్నీ ప్రమాణాలు, ఒత్తిడి గురించి తెలుసుకున్నా. షమి నుంచి సలహాలు స్వీకరిస్తున్నా. అతడి నుంచి ఎంతో నేర్చుకుంటున్నా. ఈ టోర్నీ ముగిసేలోపే నేను మెరుగైన బౌలర్‌గా బయటకొస్తా’ అని కరన్‌ అన్నాడు.

‘హ్యాట్రిక్‌ వికెట్లు తీయడం గొప్ప అనుభవం. ఆ సమయంలో నేను దానిపై దృష్టి పెట్టలేదు. పరుగులు నియంత్రించాలని అనుకున్నా. ఆ క్రమంలోనే హ్యాట్రిక్‌ బోనస్‌గా లభించింది. నా ధర గురించి ఆందోళన పడటం లేదు. నేనిలాగే ఆడాలని కోరుకుంటున్నా. జట్టును గెలిపించాలని అనుకుంటున్నా. భారత్‌లో ఆడటాన్ని ఆస్వాదిస్తున్నా. వేలాది మంది అభిమానులు ఎంతో బలాన్ని ఇస్తున్నారు. ఆటగాళ్లలో అత్యుత్తమ ఆటను వారు బయటకు తీసుకొస్తున్నారు’ అని కరన్‌ అన్నాడు.