తెలంగాణ

ఐదేళ్లలో ఎన్నిసార్లు చక్రం తిప్పారు? సికింద్రాబాద్‌ భాజపా అభ్యర్థి కిషన్‌రెడ్డి

ఐదేళ్లలో దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన భాజపా ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని సికింద్రాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ భాజపా అభ్యర్థి కిషన్‌రెడ్డి అన్నారు . తెరాస గెలిచినా ఓడినా రాష్ట్రానికి ఎలాంటి లాభంలేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడానని ఎంపీగా గెలిపిస్తే అన్ని రంగాల్లో సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానంటున్న కిషన్‌రెడ్డితో ఈటీవీ ముఖాముఖి…

ప్రచారం ఎలా ఉంది. ప్రజల నుంచి ఏవిధమైన స్పందన వస్తోంది?
ఇప్పటి వరకు నాలుగుసార్లు భాజపా అభ్యర్థులు గెలిచిన నియోజకవర్గమిది. ఇక్కడ భారతీయ జనతాపార్టీకి కొంత బలం ఉంది. దేశంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో శక్తిమంతమైన ప్రభుత్వం కావాలి అనే అలోచన ప్రజల్లో ఉంది. సికింద్రాబాద్‌ మినీ ఇండియా. అర్బన్‌ ఏరియా. ఇక్కడ అన్ని భాషలు, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఉన్నారు. ఇక్కడి ప్రజలందరూ నరేంద్రమోదీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి నా ఎన్నికకు ఇది ఉపయోగపడుతుంది. 35 సంవత్సరాలుగా విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా,  కార్యకర్తగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా పోరాటాలు, ఉద్యమాలు చేసి ప్రజలతో మమేకమైన వ్యక్తిని నేను. హైదరాబాద్‌లో ఎక్కడ ఏ సమస్య ఉందో నాకు తెలుసు. గత 15 ఏళ్లుగా శాసన సభలో కూడా నిరంతరం నగర సమస్యలపై ప్రభుత్వాలను(కాంగ్రెస్‌, తెరాస) నిలదీసిన చరిత్ర నాకు ఉంది. సహజంగా ప్రచార ప్రసార సాధనాల కారణంగా కావచ్చు ఎక్కువ మంది ప్రజల్లో కిషన్‌రెడ్డి భాజపా అనే గుర్తింపు ఉంది. వారి ఆశీస్సులను ఈ ఎన్నికల్లో ఓట్ల రూపంలో ఇస్తారని భావిస్తున్నాను.

సికింద్రాబాద్‌ స్థానం నుంచి మాజీ మంత్రి, సిట్టింగ్‌ ఎంపీని కాదని మీకిచ్చారు. దీన్ని యువతకు ప్రాధాన్యత ఇచ్చారని భావించవచ్చా? దీన్ని ఎలా చూడొచ్చు అంటారు?
ఎందుకిచ్చారో కూడా నాకు చెప్పలేదు. పోటీ చేయమని ఆదేశించారు. ఈ నేపథ్యంలో నేను అంగీకరించాను. 2014లో కూడా చర్చ వచ్చింది. కానీ, అప్పుడు దత్తాత్రేయ పోటీ చేయాలని అందరం ఏకగ్రీవంగా అనుకున్నాం. కానీ ఇప్పుడు నేను పోటీ చేయాలని అధిష్ఠానం ఆదేశించింది కాబట్టి రంగంలోకి దిగాను. ఎందుకు మార్చారనే విషయం నాతో చర్చించలేదు.

సీఎం కేసీఆర్‌, తెరాస ప్రభుత్వం చెబుతోంది ఒకటే 16 సీట్లు ఇవ్వండి దిల్లీలో చక్రం తిప్పుతామంటున్నారు.  దీన్ని  ఏవిధంగా భావించాలి?
చక్రం ఎంతమంది తిప్పుతారు. తెలంగాణలో కేసీఆర్‌ నుంచి, మమతా బెనర్జీ, రాహుల్‌గాంధీ, శరద్‌పవార్‌, చంద్రబాబు, మయావతి వీళ్లంతా చక్రం తిప్పుతామంటున్నారు. దిల్లీలో ఉన్నది ఒక్కటే చక్రం. ఇంతమంది ఏ రకంగా తిప్పుతారు. వాళ్లంతా కలిసి తిప్పే పరిస్థితి లేదు. ఇదంతా పనికిరాని ముచ్చట.  గతంలో (సికింద్రాబాద్, నాగర్‌కర్నూలు) మినహా మిత్రపక్షంతో కలిపి మిగిలిన అన్ని సీట్లు మీ(తెరాస) చేతులోనే ఉన్నాయి. గత ఐదు సంవత్సరాలుగా మీరు(తెరాస) ఎన్నిసార్లు చక్రం తిప్పారు. మీరు సాధించింది ఏంటి?