ఆంధ్రప్రదేశ్

ఐదు జిల్లాల్లో ఐటీ సోదాలు..

స్నేహ: రాష్ట్రంలో ప్రముఖ రియల్‌ ఎస్టేట్, ఆక్వా, గ్రానైట్‌ వ్యాపారులపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు ఏకకాలంలో సోదాలు ప్రారంభించారు.  అధికారులు బృందాలుగా విడిపోయి విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో దాడులు నిర్వహిస్తున్నారు. చేస్తున్న వ్యాపారం కంటే తక్కువ పన్ను చెల్లిస్తున్న వారితోపాటు అనుమానిత రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలే లక్ష్యంగా ఈ దాడులు ప్రారంభించినట్లు సమాచారం. ముఖ్యంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ఉన్న సదరన్, శుభగృహ సంస్థలతోపాటు వీఎస్‌ గ్రూపు కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగాయి.

ప్రకాశం జిల్లా కందూకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, ఆయన సమీప బంధువులకు చెందిన సదరన్‌ డెవలపర్స్, సదరన్‌ ఆక్వా ప్రాసెసింగ్, సదరన్‌ గ్రానెట్‌ సంస్థలకు చెందిన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. నంబూరు శంకర్‌రావుకు చెందిన శుభగృహ డెవలపర్స్, ఎన్‌ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు జరిపారు. గుంటూరుకు చెందిన వీఎస్‌ లాజిస్టిక్స్, జగ్గయ్యపేటలోని ప్రీకాస్ట్‌ బ్రిక్స్‌ తయారు చేసే వీఎస్‌ ఎకో బ్రిక్స్‌ సంస్థల్లో కూడా సోదాలు జరిగాయి. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావుకు చెందిన బీఎంఆర్‌గ్రూపులో రెండోరోజు కూడా విస్తృతంగా సోదాలు నిర్వహించారు.