జాతీయంవ్యాపారం

ఐదింతలు పెరిగిన ఇండిగో లాభం

దిల్లీ: ప్రైవేటు రంగ విమానయాన సంస్థ ఇండిగో మాతృక సంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ సోమవారం త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో ఇండిగో లాభాల్లో దూసుకెళ్లింది. రూ. 589.6కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో నమోదైన రూ. 117.6కోట్ల లాభంతో పోలిస్తే ఇది ఐదు రెట్లు ఎక్కువ కావడం విశేషం.

ఇక జనవరి-మార్చి త్రైమాసికంలో ఇండిగో ఆదాయం కూడా 35.5శాతం పెరిగి రూ. 8,259.8కోట్లకు చేరింది. 2017-18 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 6,097.7గా ఉంది. ఇక 2018-19 మొత్తం ఆర్థిక సంవత్సరానికి చూసినట్లయితే.. కంపెనీ వార్షిక నికర ఆదాయం రూ. 156.1కోట్లుగా ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ. 2,242.4కోట్ల వార్షిక నికర లాభం కంటే ఇది 93శాతం తక్కువ.

‘2018-19 ఆర్థిక సవత్సరం విమానయాన రంగానికి చాలా కఠినమైన సంవత్సరం. ఎయిర్‌లైన్ల మధ్య విపరీతమైన పోటీతో పాటు ఇంధన ధరలు పెరగడం, రూపాయి బలపడటం లాంటివి కంపెనీల లాభాలపై ప్రభావం చూపాయి. అయితే తొలి అర్ధభాగంలో నష్టాలను చవిచూసిన ఇండిగో.. రెండో అర్ధభాగంలో అంతే వేగంగా కోలుకుంది’ అని కంపెనీ సీఈవో రొనోజాయ్‌ దత్తా తెలిపారు. మార్చి 31 నాటికి ఇండిగో రూ. 2,429.2కోట్ల అప్పుల్లో ఉన్నట్లు కంపెనీ ఈ సందర్భంగా వెల్లడించింది.