జాతీయం

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ మాజీ ఎండీ అరెస్టు

ముంబయి: సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టగేషన్‌ బృందం అధికారులు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ మాజీ సీఎండీ రమేష్‌ భవను అరెస్టు చేశారు. వాణిజ్య వ్యవహారాల శాఖకు చెందిన ఎస్‌ఎఫ్‌ఐవో చేసిన రెండో అరెస్టు ఇది. ఇటీవల భవకు అరెస్టు నుంచి సుప్రీం కోర్టు ఇచ్చిన రక్షణ గడువు ముగియడంతో పొడిగించేందుకు కోర్టు నిరాకరించింది. దీంతో గత అర్ధరాత్రి దిల్లీలో భవను అరెస్టు చేశారు.
ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ హరి శంకరన్‌ను ఇటీవలే అరెస్టు చేశారు. ప్రస్తుతం అతన్ని ముంబయిలోని బైకుల్లా జైల్లో ఉంచారు. శంకరన్‌, భవ ఇద్దరినీ సెక్షన్‌ 447 కంపెనీల చట్టం కింద అదుపులోకి తీసుకున్నారు.
ఇప్పటికే ఎస్‌ఎఫ్‌ఏవో  కాకుండా ఈడీ ఐఫిన్‌లోని అవకతవకలపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ రైల్‌ లిమిటెడ్‌, ఐఎల్‌ఎఫ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ నెట్‌వర్క్‌ లిమిటెడ్‌,  ఐఎల్‌అండ్‌ ఎఫ్‌ఎస్‌ మాజీ ఛైర్మన్‌ రవి పార్థసారధి, ఎండీలు హరిశంకరన్‌, భవలపై మనీలాండరింగ్‌ కేసులు నమోదయ్యాయి.