ఆంధ్రప్రదేశ్

ఏసీబీ వలలో వాణిజ్య పన్నులశాఖ అధికారి

కడప: కడప వాణిజ్య పన్నులశాఖ కార్యాలయంలో డిప్యూటి కమిషనర్‌గా పనిచేస్తున్న లూర్దయ్యనాయుడు నివాసంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. బాలాజీనగర్‌లోని కీర్తి ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్న డిప్యూటి కమిషనర్‌ ఇంటిపై అనిశా డీఎస్పీ నాగభూషణం ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించారు. సోదాల సమయంలో లూర్దయ్య నాయుడుతో పాటు భార్య, కుమార్తెలు ఇంట్లోనే ఉన్నారు. సోదాల్లో 750 గ్రాముల బంగారం, కిలో వెండి, రూ.4.5లక్షల నగదు, బ్యాంకు పాసుపుస్తకాలు, ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

ఏసీబీ అధికారులకు లభించిన డాక్యుమెంట్ల ప్రకారం లూర్దయ్య నాయుడు, భార్య,పిల్లల పేరుతో చాగలమర్రి, కర్నూలు ప్రాంతాల్లో 20 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. చాగలమర్రి కర్నూలు ప్రాంతాల్లో రెండు విలాసవంతమైన భవంతులు ఉన్నట్లు గుర్తించారు. డాక్యుమెంట్ల ప్రకారం ఆయన ఆస్తులు రూ.2కోట్లు ఉంటాయని, మార్కెట్‌ విలువ ప్రకారం లెక్కిస్తే రూ.5కోట్లు ఉంటుందని ఏసీబీ డీఎస్పీ నాగభూషణం తెలిపారు. కడపతో పాటు బెంగళూరు, విజయవాడ, హైదరాబాద్‌ ప్రాంతాల్లోని ఆయన బంధువుల ఇళ్లపై కూడా సోదాలు కొనసాగుతున్నాయని డీఎస్పీ వెల్లడించారు. లూర్దయ్య నాయుడిని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు రేపు కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.