ఆంధ్రప్రదేశ్

ఏపీ మంత్రివర్గ భేటీపై కొనసాగుతున్న ఉత్కంఠ!

అమరావతి : ఏపీ మంత్రివర్గ సమావేశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ సాయంత్రానికి ఎన్నికల సంఘం నుంచి అనుమతి వస్తేనే రేపు మంత్రి వర్గ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ నెల 10న సాయంత్రం కేబినెట్‌ అజెండా అంశాల నోటీసును కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది పంపారు. నోట్‌ అందిన రెండు పని దినాల్లో తమ అభిప్రాయం చెబుతామని ఈసీ పేర్కొంది. దీంతో ఈసీ నిర్ణయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది.

మరోవైపు ఈ ఉదయం 10.30గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం భేటీ కానున్నారు. రేపటి మంత్రి వర్గ సమావేశంపై ఇవాళ సాయంత్రంలోగా ఈసీ నుంచి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ అంశాలపైనే సీఎస్ ముఖ్యమంత్రితో చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఇటీవల ఇద్దరి మధ్య నెలకొన్న అంతరాలతో ఈ భేటి ప్రాధాన్యం సంతరించుకుంది.