ఆంధ్రప్రదేశ్

ఏపీ భవన్‌లో అంబేడ్కర్‌ జయంతి వేడుకలు

దిల్లీ: ఏపీ భవన్‌లో అంబేడ్కర్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, తెదేపా నేతలు సుజనా చౌదరి, కళా వెంకట్రావు, జూపూడి ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి చంద్రబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాజ్యాంగం ఉన్నంత వరకు చిరస్థాయిలో నిలిచిపోయే వ్యక్తి అంబేడ్కర్‌ అని కొనియాడారు. రాజ్యాంగంలో  అనేక సమస్యలకు పరిష్కారాలను పొందుపరిచారని కొనియాడారు. దేశ ప్రజల చేతికి కత్తి ఇవ్వకుండా.. ఓటు హక్కు ఇచ్చానని చెప్పారని చంద్రబాబు అన్నారు. ‘‘ఓటు కత్తి కంటే పదునైంది. ఓటు వాడుకుని రాజులవుతారో.. అమ్ముకుని బానిసలవుతారో నిర్ణయించుకోవాలి’’ అన్న అంబేడ్కర్‌ వ్యాఖ్యలను ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేశారు.

రూ.2 వేల నోటుతో నీచంగా రాజకీయాలు
కొంతమంది లూటీ చేసి దేశాన్ని భ్రష్ఠు పట్టిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు చేసి రూ.2వేలు నోటు తెచ్చారని, దీంతో రాజకీయాలు నీచంగా మారాయన్నారు. ఈసీ ఏకపక్షంగా తయారైందని, మోదీ ఏం చెబితే అది చేస్తోందని విమర్శించారు. ఈవీఎం యంత్రాలు సరిగా పనిచేయడం లేదన్నారు. తెలంగాణలో 25 లక్షలు ఓట్లు తొలగించి క్షమాపణ చెప్పారని, ప్రజాస్వామ్యానికి క్షమాపణ చెబితే సరిపోతుందా? అని ప్రశ్నించారు. ఏపీలో ఫారం -7 దుర్వినియోగం చేస్తే ఈసీ చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రఫేల్‌ వివాదం రావణకాష్ఠంలా కొనసాగుతోందన్నారు. వీవీప్యాట్‌ స్లిప్పులు 50 శాతం లెక్కించాలని కోరుతున్నామని చెప్పారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఈవీఎంలు వాడడం లేదని మరోసారి గుర్తు చేశారు. అంబేడ్కర్‌ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రధానిగా ఉండేందుకు ఎన్ని తప్పులైనా చేస్తామనే విధంగా మోదీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దేశ పౌరులు ఆలోచించాల్సిన సమయం ఇది అని చంద్రబాబు పిలుపునిచ్చారు.