ఆంధ్రప్రదేశ్

ఏపీలో అతడే.. నా తొలి అభ్యర్థి!

వచ్చే ఎన్నికల్లో ఏపీలో జనసేన తరఫున పోటీ చేసే మొదటి అభ్యర్థిని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం స్థానాన్ని పితాని బాలకృష్ణ కు కేటాయించినట్టు వెల్లడించారు. శెట్టి బలిజవర్గానికి చెందిన బాలకృష్ణ రిటైర్డ్ కానిస్టేబుల్ అని తెలిసింది.

ఈ నియోజకవర్గానికి టీడీపీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రాతినిద్యం వహిస్తున్నారు. కాగా తనను ఆదరించి జనసేనలో చేర్చుకున్న పవన్‌కళ్యాణ్‌కు పాదాభివందనం చేస్తున్నానని బాలకృష్ణ అన్నారు. అతిపేద కుటుంబం నుంచి వచ్చిన తనను ఓ మోసపూరిత నేత తీసుకువెళ్ళాడని, తన ఉద్యోగానికి రాజీనామా చేయించి మోసం చేశాడని పరోక్షంగా వైసీపీ అధినేత జగన్‌ను ఉద్దేశించి అన్నాడు. విశ్వసనీయత, మాట తప్పడం, మడమ తిప్పడం అనేది షోలు తప్ప లోపలంతా దుర్మార్గం, కుట్ర, కుతంత్రం అని దుయ్యబట్టారు.  ఈ సందర్భంగా మాట్లాడిన పవన్..బాలకృష్ణ ఇటీవల తనను కలిశారని, రండి..మాట్లాడుదాం అని చెప్పినప్పటికీ..సీటు ఇస్తానని తాను అనలేదని తెలిపారు. ‘ పితాని బాలకృష్ణ బలమైన వ్యక్తి. బాగా మాట్లాడుతారు. జనసేన పార్టీ తరఫు నుంచి బీ.ఫారం తీసుకుంటున్న మొదటి వ్యక్తి ఆయన ‘ అని పవన్ వెల్లడించారు. ఎవరు పార్టీ పెట్టినా దానికి కులం పేరు అపాదిస్తారని, తను అంబేద్కర్ ను ప్రేమిస్తానని చెప్పిన పవన్…. కులాల ఐక్యత అవసరమని, మన ఆలోచనా స్థాయి మారాలని అన్నారు.