జాతీయం

ఏపీకి రూ.708కోట్లు విడుదలచేసిన కేంద్రం

ఉపాధిహామీ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన పెండింగ్‌ నిధుల్ని కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. రాష్ట్రంలో చేపట్టిన ఉపాధి హామీ పనులకు గాను రాష్ట్రానికి రావాల్సిన మొత్తం నిధుల్లో రూ.708 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. గత ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు యూసీలను అందజేసింది. వీటి ప్రకారం ఏపీకి రావాల్సిన రూ.2500 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. గత ఐదేళ్ల కాలంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వమే వినియోగించుకుంది. గత ప్రభుత్వంలోని మంత్రులు, ఎంపీలు యూసీలను సమర్పించడంతో పాటు ఉపాధి హామీ పనులకు పెండింగ్‌లో ఉన్న నిధుల్ని విడుదల చేయాలని జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిని, కార్యదర్శుల్ని కలిసి విన్నవించారు. ఈ మేరకు యూసీలను పరిశీలించిన కేంద్రం.. ఎంతమేరకు పనులు జరిగాయో పరిశీలించి గురువారం రూ.708.65 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. పెండింగ్‌ నిధుల్ని త్వరలోనే విడుదల చేయనుంది.