జాతీయం

ఏంటి..ఈ మాత్రానికే విడాకులా!

భోపాల్‌: ఆధునిక ప్రపంచంలో మనుషుల మధ్య బంధాలకు విలువే లేకుండా పోయింది. ఒకప్పుడు బలమైన కారణాలుంటేగానీ విడాకుల ప్రస్తావన వచ్చేది కాదు. కానీ ఇప్పుడు చిన్న చిన్న కారణాలను చూపి విడిపోవాలని చూస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఓ జంట విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించింది. ఇంతకీ కారణమేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. తన భర్త కొన్ని రోజుల పాటు స్నానం చేయకుండా, గడ్డం గీసుకోకుండా ఉంటున్నారని ఓ మహిళ విడాకులు కోరింది. దీనిపై విచారణ ప్రారంభించిన భోపాల్‌ ప్యామిలీ కోర్టు ఇద్దరినీ ఆరు నెలల పాటు విడిగా ఉండాలని తెలిపింది. అప్పుడే విడాకులు ఇవ్వగలమని స్పష్టం చేసింది.

వీరిని కౌన్సెల్‌ చేసిన షెయిల్‌ అవస్థీ తెలిపిన వివరాల ప్రకారం.. భోపాల్‌లోని బరిగఢ్‌కు చెందిన ఓ జంట విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తన భర్త వరుసగా ఏడు నుంచి ఎనిమిది రోజుల పాటు స్నానం చేయరని దరఖాస్తులో పేర్కొంది. దీంతో అతని నుంచి దుర్గంధం వస్తోందని.. స్నానం చేయమని చెబితే పెర్‌ఫ్యూమ్‌తో సరిపెట్టుకుంటాడని తెలిపింది. అతని ప్రవర్తనతో విసిగి పోయిన ఆమె విడాకులు కావాలని కోరింది. దానికి భర్త కూడా సమ్మతించడంతో ఇద్దరూ కలిసి కోర్టును ఆశ్రయించారు. వీరిది కులాంతర వివాహం. అదీ పెద్దలు అనుమతితో జరిగిన పెళ్లి కావడం గమనార్హం.