క్రీడలు

ఎవరెప్పుడనేది తర్వాత నిర్ణయిస్తాం : కోహ్లీ

ముంబయి : రానున్న ప్రపంచకప్‌లో ఎవరు ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేస్తారనేది తర్వాత నిర్ణయిస్తామని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. భారత జట్టులో నాలుగో స్థానం బ్యాట్స్‌మెన్‌పై సందిగ్ధం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే, తమిళనాడు ఆల్‌రౌండర్‌ విజయ్‌శంకర్‌ నాలుగో స్థానంలో వస్తాడన్న ప్రచారంతో కోహ్లీ సమ్మతించినప్పటికీ అది ఇప్పుడే నిర్ధారించలేమని పేర్కొన్నాడు. విజయ్‌తో పాటు కేఎల్‌ రాహుల్, దినేశ్‌ కార్తీక్‌, కేదర్‌ జాదవ్‌ కూడా ఉన్నారు. కాబట్టి ప్రపంచకప్‌లో ఎవరే స్థానంలో బ్యాటింగ్‌ చేస్తే ఉపయోగం ఉంటుందో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నాడు. విజయ్‌ ఎంపిక గురించి మాట్లాడుతూ.. అన్ని విషయాలు చర్చించే నిర్ణయం తీసుకున్నామని అన్నాడు. విజయ్‌.. బౌలింగ్‌, బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌ కూడా చురుగ్గా చేయగలడని పేర్కొన్నాడు. అయితే నాలుగో నంబర్‌లో ఎవరు బ్యాటింగ్‌కు వస్తారనేది నిర్ణయించడానికి ఇంకా సమయం ఉందని కోహ్లీ తెలిపాడు. ప్రపంచకప్‌లో పాల్గొనే జట్టును ఈ నెల 15న ప్రకటించిన విషయం తెలిసిందే.