అంతర్జాతీయంజాతీయం

ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టం

ఓవల్‌ వేదికగా జరగబోయే మ్యాచ్‌లో టీమిండియా X ఆసిస్‌ జట్లలో ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టమని భారత మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ అన్నారు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ సందర్భంగా ఓ ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన  ఈ విషయాన్ని వెల్లడించారు. సన్నీ మాట్లాడుతూ ఆరోన్‌ ఫించ్‌ నేతృత్వంలోని ఆసిస్‌ జట్టు వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో అనూహ్యంగా పుంజుకొని విజయం సాధించడం చూస్తే ఆ జట్టు మునపటిలా మారిందని పేర్కొన్నాడు.

అయితే మ్యాచ్‌లో కీలక సమయాల్లో ఆసీస్‌ వికెట్లు తీసి ఆటపై పట్టుసాధించాలని టీమిండియాకు సూచించాడు. ఇదొక అద్భుతమైన మ్యాచ్‌గా నిలుస్తుందని, స్టీవ్‌స్మిత్‌కు కూడా ప్రత్యేకమని తెలిపాడు. ఈ రెండు జట్ల మధ్య ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టమని అన్నాడు. అలాగే భారత జట్టులో స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తారని, మిడిల్‌ ఆర్డర్‌లో చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ వికెట్లు తీయడం వల్లే ఇటీవల కాలంలో టీమిండియా విజయానికి ప్రధాన కారణమని వివరించాడు. ఒకవేళ స్పిన్నర్లు మిడిల్‌ ఓవర్లలో వికెట్లు తీయకపోతే అది ప్రత్యర్థులకు అవకాశంగా మారి ఆఖరి ఓవర్లలో చెలరేగేందుకు అవకాశం వస్తుందని సన్నీ స్పష్టంచేశాడు.