జాతీయం

ఎయిమ్స్‌ వైద్యుడి ఆత్మహత్య..

దిల్లీ: భార్యతో గొడవల కారణంగా క్షణికావేశంతో ప్రాణాలు తీసుకున్నాడో వైద్యుడు. దిల్లీలోని ఎయిమ్స్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్న 34ఏళ్ల మనీష్‌ శర్మ తన ఇంటి బాల్కనీ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వారు దక్షిణ దిల్లీలోని గౌతమ్‌ నగర్‌ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. భార్యతో గొడవ పడి వాళ్ల ఫ్లాట్‌ ఉన్న నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకేశాడని పోలీసులు వెల్లడించారు. మంగళవారం అర్థరాత్రి ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగు చూసింది.

మనీష్‌ స్వస్థలం రాజస్థాన్‌లోని నాగౌర్‌. ఎయిమ్స్‌లో సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆర్నెళ్ల క్రితం తృప్తి చౌదరితో వివాహమైంది. ఆమె కూడా వైద్యురాలే. ఛండీగఢ్‌లోని పీజీఐలో పనిచేస్తున్నారు. వీరు గౌతమ్‌ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అదే అంతస్తులో మనీష్‌తో పనిచేసే మరో ఇద్దరు కూడా ఉంటున్నారు. మంగళవారం రాత్రి భార్యాభర్తలు గొడవ పడుతుండడంతో పొరుగున ఉన్నవారు, అతడితో కలిసి పనిచేసే వారు అడ్డుకునేందుకు ప్రయత్నించారని, అయినా వారు గొడవ ఆపలేదని స్థానికులు తెలిపారని పోలీసులు వెల్లడించారు. ఓ దశలో తృప్తిపై దాడి చేయబోయాడని, దీంతో ఆమెను కాపాడేందుకు పొరుగింట్లో వాళ్లు ఆమెను పక్కకు తీసుకెళ్లారని చెప్పారు. ఎవరూ లేని సమయం చూసి మనీశ్‌ హఠాత్తుగా బాల్కనీ నుంచి కిందకు దూకేశాడని పోలీసులు తెలిపారు. అతడిని వెంటనే ఎయిమ్స్‌కు తరలించగా అప్పటికే మరణించాడని వెల్లడించారు.

వాళ్లు పెళ్లైనప్పటి నుంచి తరచూ గొడవ పడేవారని, ఇద్దరూ ఒకరి ఫోన్‌ ఒకరు చూశారని, ఎవరితో మాట్లాడుతున్నావో చెప్పాలని అనుమానంతో ఎక్కువగా పోట్లాడుకునే వారని స్థానికులు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. మనీష్‌కు నిద్ర సరిగ్గా పట్టనందున ఎప్పుడూ నిద్ర మాత్రలు వేసుకుంటాడని, ఆ రోజు రాత్రి చాలా నిద్ర మాత్రలు కూడా వేసుకున్నాడని అతడి సహోద్యోగులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.