క్రైమ్

ఎమ్మెల్యే మృతిపై స్థానికుల ఆగ్రహం.. అరకు, డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్లపై దాడి..

అరకు, డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్లపై దాడికి దిగిన స్థానికులు.. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని పైర్..

ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి అరకు, డుంబ్రిగూడలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నేతల మృతికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమంటూ.. వందలాదిమంది స్థానికులు అరకు, డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్లపై దాడికి దిగారు. పీఎస్‌లలోకి చొరబడి.. ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి తగులబెట్టారు. అవుట్ పోస్టును తగులబెట్టారు. కొంతమంది యువకులు పోలీస్ స్టేషన్‌లలో ఫర్నీచర్‌ను బయటకు తీసుకొచ్చి ధ్వంసం చేసి నిప్పు పెట్టారు.

కొందరు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న బైకులు, వాహనాలను ధ్వంసం చేసి వాటిని కూడా దహనం చేశారు. మంటల్లో వాహనాలన్నీ కాలి బూడిదయ్యాయి. డుంబ్రిగూడలో కూడా ఉద్రిక్తత ఏర్పడింది. పోలీస్ స్టేషన్‌లో చొరబడిన స్థానికులు.. ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి ఓ కానిస్టేబుల్‌పై దాడి చేశారు. వందలాదిమంది విరుచుకుపడటంతో.. పోలీసు సిబ్బంది కూడా ప్రతిఘటించలేకపోయారు. భయంతో మిగిలిన సిబ్బంది అక్కడి నుంచి పారిపోయారు.

నేతలకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని స్థానికులు మండిపడుతున్నారు. మూడు రోజులుగా మావోయిస్టు వారోత్సవాలు జరుగుతుంటే.. పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. నేతలు అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పలేదని.. కనీసం భద్రతను కూడా పెంచలేదంటున్నారు.

విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, ఆయన ప్రధాన అనుచరుడు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమపై ఆదివారం మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వీరి ఇద్దరూ మృతి చెందారు. డుంబ్రిగూడ మండలంలోని లిప్పిట్టిపుట్టు వద్ద నక్సల్స్ ఈ దాడికి పాల్పడ్డారు. గ్రామదర్శిని పర్యటనలో ఉండగా మావోయిస్టులు అదునుచూసి దెబ్బకొట్టారు.