అంతర్జాతీయం

ఎన్నికలున్నాయ్‌.. పెళ్లి ఆడంబరంగా వద్దు

పనాజీ: గోవా కాంగ్రెస్‌ అభ్యర్థి కుమారుడి పెళ్లిపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది.  ఎన్నికల వేళ వివాహాన్ని నిరాడంబరంగా జరుపుకోవాలని సూచించింది. పెళ్లిని ఎన్నికల ప్రచార కార్యక్రమంలా వాడుకునే అవకాశం ఉన్నందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల అధికారులు చెబుతున్నారు.

గోవాలోని శిరోదా అసెంబ్లీ నియోజకవర్గానికి ఏప్రిల్‌ 23న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్న మహదేవ్‌ నాయక్‌ ఈ నెల 20న తన కుమారుడి పెళ్లి పెట్టుకున్నారు. అయితే పోలింగ్‌ నేపథ్యంలో పెళ్లిని వాయిదా వేసుకోవాలని ఎన్నికల అధికారులు అడిగారు. ఇందుకు మహదేవ్‌ నాయక్‌ నిరాకరించడంతో వేడుకను నిరాడంబరంగా జరుపుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు. అవసరమైతే ఎన్నికల తర్వాత వివాహ విందు ఏర్పాటుచేసుకోవచ్చని సలహా ఇచ్చారు. అలా కాదని ఏప్రిల్‌ 20నే పెళ్లిని అంగరంగ వైభవంగా నిర్వహిస్తే వేడుకను అధికారులు పర్యవేక్షిస్తారని రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది.

‘సాధారణంగా ఎన్నికల ముందు జరిగే ఇలాంటి కార్యక్రమాలను అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా ఉపయోగిస్తే గనుక కార్యక్రమానికి అయ్యే మొత్తం ఖర్చును అభ్యర్థి ఎన్నికల ఖర్చు కిందే లెక్కిస్తాం. ఈ విషయాన్ని మహదేవ్‌ నాయక్‌కు వివరించాం. అయినప్పటికీ ఆయన పెళ్లిని ఆడంబరంగా నిర్వహిస్తే.. మేం ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తాం. ఒకవేళ నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలితే వెంటనే చర్యలు తీసుకుంటాం’ అని ఎన్నికల అధికారులు వెల్లడించారు.

అధికారుల హెచ్చరికలపై మహదేవ్‌ నాయక్‌ అసహనం వ్యక్తం చేశారు. ‘ఎట్టిపరిస్థితుల్లోనూ వివాహాన్ని వాయిదా వేయలేం.  వారు(అధికారులను ఉద్దేశిస్తూ) ఏం చేయాలనుకుంటే అది చేసుకోవచ్చు. ఖర్చుపై నిఘా పెట్టేందుకు పెళ్లిని వీడియో తీసుకున్నా ఫర్వాలేదు. ఎన్నికల్లో నేను గెలుస్తానని ప్రత్యర్థులకు ముందే తెలుసు. అందుకే నాపై ఇలాంటి ఫిర్యాదులు చేస్తున్నారు’ అని నాయక్‌ అన్నారు.