అంతర్జాతీయంజాతీయం

ఎన్నికలకు రాజ్‌ఠాక్రే ఎమ్‌ఎన్‌ఎస్‌ దూరం..

ముంబయి: రాజ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ్‌ సేన(ఎంఎన్‌ఎస్‌) లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనుంది. ఈ మేరకు ఆ పార్టీ ముఖ్య నాయకుడు శిరీష్‌ సావంత్‌ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. గత కొంత కాలంగా నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్‌ పవార్‌తో రాజ్‌ ఠాక్రే సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీకి మద్దతు పలికే అవకాశం ఉన్నట్లు సమాచారం. మహారాష్ట్రలో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన ప్రతిపక్ష కూటమిలో ఎమ్‌ఎన్‌ఎస్‌  చేరనుందనే ఊహాగానాలు వినిపించాయి. కానీ కాంగ్రెస్ అందుకు సుముఖంగానే లేదనే వార్తలు వస్తున్నాయి. రాజ్‌ ఠాక్రే కలవడం మూలంగా ఉత్తర భారత్‌లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉందని వారు భావిస్తున్నట్లు తెలుసుస్తోంది.

ఎన్సీపీ సహకారంతో కనీసం ఒక్క సీటులోనైనా ఎమ్‌ఎన్‌ఎస్‌ పోటీ చేస్తుందని తొలుత భావించారు. కానీ ఈ విషయంపై ఇప్పటి వరకు రెండు పార్టీల నుంచి ఎటువంటి సమాచారం లేదు. 2009లో 13 శాసనసభ స్థానాలు గెలుచుకున్న ఎమ్‌ఎన్‌ఎస్‌ 2014లో ఒక్క సీటుకే పరిమితం కావాల్సి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఒకప్పుడు సత్తా చాటింది. కానీ ప్రస్తుతం ఆ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా నిలిచిన రాజ్‌ ఠాక్రే కొంత కాలంగా భాజపా, ఆ పార్టీ నాయకులపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.