జాతీయం

‘ఎక్స్‌పైరీ పీఎం’కు ఫోన్‌ చేయను: మమత

విష్ణుపుర్‌: సైక్లోన్‌ ఫొనిపై చర్చించడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ నుంచి వచ్చిన ఫోన్‌ కాల్స్‌కు తాను తిరిగి సమాధానం ఇవ్వనని సోమవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ స్పష్టం చేశారు. త్వరలో వెళ్లిపోయే ప్రధాని(ఎక్స్‌పైరీ పీఎం)తో తాను వేదిక పంచుకోవాలనుకోవట్లేదని ఆమె వెల్లడించారు.  తుపాను సహాయక చర్యలపై కూడా మమత రాజకీయాలకు పాల్పడుతున్నారని ఈ రోజు ప్రధాని మోదీ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఒడిశా, బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో బీభత్సం సృష్టించిన తుపాను మీద ఇప్పుడు రాజకీయంగా దుమారం రేగుతుంది.
‘సైక్లోన్‌ ఫొని పశ్చిమ బెంగాల్ తీరాన్ని తాకనుందని తెలిసి మమతా దీదీతో మాట్లాడటానికి ప్రయత్నించాను. కానీ ఆమె నాతో మాట్లాడటానికి నిరాకరించారు. అది ఆమె అహంకారానికి నిదర్శనం’ అని బెంగాల్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆమె తిరిగి ఫోన్ చేస్తారని ఎదురు చూశాను. కానీ ఆమె చేయలేదు. మరలా ఆమెకు కాల్ చేశాను. బెంగాల్ ప్రజల యోగక్షేమాలు గురించి ఆవేదనకు గురై మమతాదీదీతో మాట్లాడాలనుకున్నాను. కానీ రెండో సారి కూడా ఆమె నాతో మాట్లాడలేదు’ అని ఆయన ట్విటర్‌ వేదికగా విమర్శలు చేశారు.

తాను ఖరగ్‌పూర్‌ ర్యాలీలో పాల్గొనడం మూలానా ప్రధానితో ఫోన్‌ మాట్లాడలేకపోయానని విష్ణుపుర్ ర్యాలీ సందర్భంగా ఆమె వెల్లడించారు. ‘ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న మూలానా ఎక్స్‌పైరీ పీఎంతో తాను వేదిక పంచుకోవాలనుకోవట్లేదు’ అని ఆమె స్పష్టం చేశారు. భాజపా ప్రభుత్వం మరోసారి అధికారాన్ని చేపట్టదన్న ధీమా ఆమె వ్యాఖ్యల్లో కనిపిస్తుంది.  ప్రధాని మమతకు ఫోన్ చేయకుండా, గవర్నర్ కేసరీ నాథ్ త్రిపాఠికి ఫోన్ చేసి సైక్లోన్‌ గురించి వివరాలు తెలుసుకున్నారని మీడియాలో వచ్చిన వార్తలతో ఈ వివాదానికి తెరలేచింది. తనకు ఫోన్ చేయకపోవడంపై మమత అసంతృప్తితో ఉన్నారని సమాచారం.