ఆంధ్రప్రదేశ్

ఎందరో విలన్లను తట్టుకొని నిలబడ్డాం:చంద్రబాబు

అమరావతి: ఈ ఎన్నికల సమయంలో ఎంతోమంది విలన్లను తట్టుకొని నిలబడ్డామని తెదేపా జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.  రాష్ట్రంలో మళ్లీ తెదేపా ప్రభుత్వమే వస్తుందని నేతలకు స్పష్టంచేశారు. సార్వత్రిక ఎన్నికలపై అమరావతిలోని హ్యాపీ రిసార్ట్స్‌లో తెదేపా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పలు అంశాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ యంత్రాంగం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెదేపాకు వ్యతిరేకంగా మోదీ, కేసీఆర్‌ అనేక కుట్రలు చేశారని చంద్రబాబు మండిపడ్డారు.

మనలాంటి పార్టీ దేశంలో ఎక్కడా లేదు!
‘‘ఎన్నికలకు ముందు ప్రజలందరి అభిప్రాయాలూ తీసుకున్నాం. మన పార్టీకి వ్యతిరేకంగా ప్రత్యర్థులు పన్నిన కుట్రలను పోటాపోటీగా ఎదుర్కొన్నాం. కార్యకర్తలతో మమేకమయ్యే తెదేపాలాంటి పార్టీ దేశంలో ఎక్కడా లేదు. రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని మోదీ ప్రయత్నాలన్నీ చేశారు.  తెదేపాకు ఏదోలా నష్టం కలిగించాలనేదే భాజపా ధ్యేయం. తెదేపాకు నష్టం కల్గించేందుకు కేసీఆర్‌ కూడా ప్రయత్నించారు. రాష్ట్రంలో జగన్‌ కుట్రలకు మోదీ, కేసీఆర్‌ కుతంత్రాలు తోడయ్యాయి. ఎందరు ఇబ్బందులు పెట్టినా ప్రజలు తెదేపా వెంటే ఉన్నారు. ప్రమాణాలు, ముహూర్తాలు, మంత్రి పదవులంటూ వస్తోన్న వార్తలన్నీ మైండ్‌గేమ్‌లో భాగమే. రాష్ట్రంలో ఓటింగ్‌ శాతం తగ్గించేందుకు కుట్రలు పన్నారు. ఆ కుట్రలు తెలిసే ఓటింగ్‌కు తరలిరావాలని ప్రజలకు నేను పిలుపునిచ్చాను. రాష్ట్రంలో తెదేపా విజయంపై సందేహం లేదు. సీట్లు, ఆధిక్యతపైనే దృష్టి ఉంది. భవిష్యత్తులో జరిగే ప్రతి ఎన్నికలోనూ తెదేపానే గెలవాలి. నేను వాస్తవికత ప్రాతిపదికగానే మాట్లాడాతా. పనిచేస్తా’’ అని చంద్రబాబు అన్నారు.

తొలి దశలో ఎన్నికలతో మేలే జరిగింది!
‘‘రాష్ట్రంలో తొలి దశలోనే ఎన్నికలు పెట్టడం తెదేపాకు మేలు చేసింది. ఓటర్లు ఏపీకి రాకుండా కేసీఆర్‌ కుట్రలు పన్నారు. ఓటర్లు ఓటు వేయకుండా అనేక ప్రయత్నాలు చేశారు. సొంత వాహనాల్లో వచ్చి మరీ పట్టుదలతో ఓటర్లు ఓట్లు వేసి వెళ్లారు. ఎన్నికల్లో అనేక మంది విలన్లను తట్టుకుని నిలబడ్డాం. తెలంగాణ కంటే మన ఆంధ్రప్రదేశ్ అనేక రంగాల్లో ముందుంది. అధికారుల్లో చీలిక తెచ్చే ప్రయత్నాలు మంచివి కాదు. రాష్ట్రాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలనేదే నా సంకల్పం’’ అని చెప్పారు.