తెలంగాణ

ఉప్పొంగిన గోదారి

హైదరాబాద్‌, ధర్మారం-న్యూస్‌టుడే,  డిజిటల్‌-పెద్దపల్లి: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో బుధవారం కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. పథకంలోనే మొట్టమొదటి ఎత్తిపోతలను ప్రయోగాత్మకంగా ప్రారంభించగా విజయవంతమైంది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోని ఆరో ప్యాకేజీ పంప్‌హౌస్‌ ఇందుకు వేదికైంది. ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం 12:02 గంటలకు ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్‌ కంప్యూటరు మీట నొక్కి మొదటి పంపును ప్రారంభించారు. సర్జ్‌పూల్‌ నుంచి పరుగులు పెట్టిన గోదావరి జలాలు మేడారం జలాశయంలోకి చేరడంతో అధికారులు, ప్రజలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.

స్మితా సబర్వాల్‌ ముందుగా ఆరో ప్యాకేజీలోని ఏడు మోటార్లలో ఇప్పటికే పూర్తయిన 4 మోటార్లతో పాటు మిగిలిన 3 మోటార్లను పరిశీలించారు. మే నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.