జాతీయం

ఉద్యోగ నియామకాల్లో 11%వృద్ధి నమోదు

దేశవ్యాప్తంగా ఐటీ – సాఫ్ట్‌వేర్‌ రంగంలో నియామకాలు పెరగడంతో ఈ ఏడాది మే నెలలో మొత్తంగా 11 శాతం మేర ఉద్యోగ నియామకాల్లో వృద్ధి నమోదైందని తాజా నివేదికలో వెల్లడైంది. జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌ పేరుతో ప్రముఖ జాబ్‌ పోర్టల్‌ నౌకరీ డాట్‌కామ్‌ తాజా నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. గత ఏడాది మే నెలతో పోల్చితే 2019 మే నెలలో 11 శాతం వృద్ధి నమోదు చేసినట్లు నివేదికలో వెల్లడించింది. ‘దేశవ్యాప్తంగా ఉపాధి కల్పిస్తున్న వివిధ రంగాలు, నగరాల్లో సానుకూల ప్రభావాలు నెలకొన్నాయి. గత ఆరు నెలల్లో నమోదైన నియామకాల వృద్ధిని పరిగణనలోకి తీసుకున్నట్లయితే ఈ వృద్ధి ఇలానే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి’ అని ఇన్‌ఫో ఎడ్జ్‌ ఇండియా చీఫ్‌ మార్కెటింగ్‌ అధికారి సుమీత్‌ సింగ్‌ పేర్కొన్నారు.

ఐటీ-సాఫ్ట్‌వేర్‌ రంగం తర్వాత బిజినెస్‌ ప్రాసెస్‌ అవుట్‌సోర్సింగ్‌ (బీపీవో) 11 శాతం, విద్యారంగం (11 శాతం), ఐటీ-హార్డ్‌వేర్‌ (11 శాతం), నిర్మాణ రంగం (1 శాతం), ఎఫ్‌ఎంసీజీ (4 శాతం) రంగాలు ఉద్యోగ నియామకాల్లో వృద్ధిని నమోదు చేశాయి. బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా రంగాల్లో ఎలాంటి వృద్ధి నమోదు కాలేదు. ఆటోమొబైల్స్‌ 16 శాతం, ఫార్మా రంగంలో 6 శాతం మేర ఉద్యోగ నియామకాల్లో తగ్గుదల నమోదు అయింది.