జాతీయం

ఈ తీరు దేశానికి ప్రమాదం: శివసేన

ముంబయి (మహారాష్ట్ర): ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ప్రజలు అధికారం నుంచి దించేస్తారని జోస్యం చెప్పింది. భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా పర్యటన నేపథ్యంలో కోల్‌కతాలో చోటు చేసుకున్న పరిణామాలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శివసేన పత్రిక సామ్నాలో ఈ విషయంపై ఓ కథనం వెలువడింది.

‘సీనియర్‌ నాయకులు తమ రాష్ట్రంలోకి రావడానికి ఆమె (మమతా బెనర్జీ) ఒప్పుకోవట్లేదు. ఇంతటి ఘోరమైన ప్రవర్తనా? హింసాత్మక ఘటనలు జరిగేలా చేస్తూ పశ్చిమ బెంగాల్‌ను ఆమె యుద్ధ క్షేత్రంలా మార్చేశారు. ప్రధాని మోదీతో పాటు భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఆమె వ్యతిరేకించని రోజు లేదు. ఇంతకు ముందు ఆ రాష్ట్రంలో సీపీఎం హింసను ప్రోత్సహించింది.. ఆ పార్టీని ప్రజలు అధికారంలోంచి దించేశారు. ఇప్పుడు మమత వంతు వచ్చేసింది’ అని శివసేన సామ్నాలో పేర్కొంది. ‘ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేయొద్దా? అమిత్‌ షా తనను తాను దేవుడు అనుకుంటున్నారా?’ అని మమత చేసిన వ్యాఖ్యలపై శివసేన స్పందిస్తూ… ‘ఆమె కూడా దుర్గా మాతా కాదు కదా?.. ఇటువంటి హింస చోటు చేసుకోవడం దేశానికి ప్రమాదం’ అని పేర్కొంది.