జాతీయంసినిమా

ఈ అమ్మాయిని గుర్తుపట్టారా?: అమితాబ్‌

ముంబయి: ‘ఈ అమ్మాయి ఎవరో గుర్తు పట్టండి..?’ అంటున్నారు అగ్ర కథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌. ఆయన తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పాత ఫొటోను షేర్‌ చేశారు. అందులో అమితాబ్‌తో ఓ చిన్నారి కనిపించింది. ‘ఎవరో గుర్తు పట్టండి..?తను ఎవరో కాదు కరీనా కపూర్‌. గోవాలో ‘పుకార్‌’ సినిమా షూటింగ్‌ సమయంలో సెట్‌కు వచ్చింది. ఆమె కాలికి గాయమైంది. దానికి మందులు రాసి, బ్యాండేజ్‌ వేశాం’ అంటూ బిగ్‌బి ఫొటో సందర్భాన్ని వివరించారు.

‘పుకార్‌’ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌ధీర్‌ కపూర్‌, జీనత్‌ అమన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. రమేశ్‌ బెహల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1983లో విడుదలై హిట్‌ అందుకుంది. కరీనా కపూర్‌ రణ్‌ధీర్‌ కుమార్తె కావడంతో ఆమె సెట్‌కు వెళ్లారు. బిగ్‌బి ఇటీవల ‘బద్లా’ సినిమాతో మంచి హిట్‌ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘బ్రహ్మాస్త్ర’లో నటిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ 20న సినిమా విడుదల కాబోతోంది.