ఆంధ్రప్రదేశ్

ఈసీ నిర్ణయంపై భగ్గుమన్న టీడీపీ

తిరుపతి: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలన్న ఈసీ నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ భగ్గుమంది.ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతి సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఏపీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని సహా పలువురు నాయకులు, కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. పోలింగ్‌ ముగిసిన నెల తర్వాత వైకాపా ఫిర్యాదు చేస్తే ముందూ..వెనుక ఆలోచించకుండా ఈసీ నిర్ణయం తీసుకోవడమేంటని మండిపడ్డారు.
చెవిరెడ్డి ఫిర్యాదుమేరకే…
చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని ఎన్‌.ఆర్‌.కమ్మపల్లి, పులవర్తివారి పల్లి, కొత్త కండ్రిగ, కమ్మపల్లి, వెంకటరామాపురం కేంద్రాల్లో ఏప్రిల్‌ 11న జరిగిన ఎన్నికల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని, అక్కడ రీపోలింగ్‌ నిర్వహించాలని కోరుతూ చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గతంలో ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేసిన ఎన్నికల అధికారులు భారత ఎన్నికల సంఘానికి నివేదిక పంపించారు. ఆ నివేదిక ఆధారంగా రీపోలింగ్‌ చేపట్టాలని నిర్ణయం తీసుకున్న ఈసీఐ ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది.

రీపోలింగ్‌ జరిగే కేంద్రాలివే
చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ఎన్‌.ఆర్‌.కమ్మపల్లి, పులవర్తివారిపల్లి,  కొత్తకండ్రిగ, కమ్మపల్లి,  వెంకటరామాపురం పోలింగ్‌ కేంద్రాల్లో ఈనెల 19న  ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు రీపోలింగ్‌ నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.