ఆంధ్రప్రదేశ్

ఈసీపై వార్‌.. రేపు దిల్లీకి సీఎం

అమరావతి: వీవీప్యాట్‌ల లెక్కింపుపై సుప్రీం తీర్పు వ్యవహారంలో రివ్యూ పిటిషన్‌ వేస్తానని చంద్రబాబు తెలిపారు. ఇందుకోసం రేపు దిల్లీకి వెళ్లనున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఏపీలో ఎన్నికల నిర్వహణపై ఈసీఐని ప్రశ్నించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఈవీఎంల మొరాయింపు సమయంలో వాటిని సరిచేసేందుకు వచ్చిన సాంకేతిక నిపుణులు ఎవరు? వారికి ఉన్న అర్హతలేంటో చెప్పాలని ఈసీని డిమాండ్‌ చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. వారిని ఎలా నియమించారని ప్రశ్నించనున్నట్లు పేర్కొన్నారు.

వీవీప్యాట్‌ల మొత్తం లెక్కింపునకు ఆరు రోజులు పట్టడమేంటని సీఎం ప్రశ్నించారు. వీవీప్యాట్‌లోని స్లిప్‌లు లెక్కించడానికి ఆరు గంటలు మించదని వెల్లడించారు. గతంలో బ్యాలెట్‌ పత్రాలు లెక్కించే పద్ధతిలో ఎంత సమయం పట్టిందో గుర్తు చేసుకోవాలని సూచించారు. ఈ విషయంలో తాను ఛాలెంజ్‌ చేస్తున్నానని, నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్‌ విసిరారు. దీనిపై దేశ స్థాయిలో పోరాడేందుకు సిద్ధమని వెల్లడించారు. అవసరమైతే ధర్నాలు, ఆందోళనలు చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే పదవి అంగటి సరకులా తయారైందని, ప్రజాప్రతినిధుల భవిష్యత్‌ యంత్రాలపై ఆధారపడి ఉండడమేంటని సీఎం విమర్శించారు. ఏకధాటిగా రెండు గంటలపాటు యంత్రం పని చేయకపోతే రీపోలింగ్‌కు అవకాశముందని వివరించారు.