ఆంధ్రప్రదేశ్

ఈసీపై యుద్ధానికి సిద్ధం

దిల్లీ: ఈసీఐపై పోరుకు తెదేపా సిద్ధమైంది. పోలింగ్‌ జరిగిన తీరు, కనీస సౌకర్యాల కల్పన, ఈవీఎంల మొరాయింపు తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో నేతలు దిల్లీలో సీఈసీ సునీల్‌ అరోడాకు ఫిర్యాదు చేశారు. అవసరమైతే నిరసనలు చేసేందుకు కూడా వెనకాడబోమని తేల్చి చెప్పారు. వీవీప్యాట్‌ల లెక్కింపు తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం దిల్లీ చేరుకున్న టీడీపీ మంత్రులు, నేతలు ఈటీవీతో మాట్లాడారు.

ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు :అచ్చెన్నాయుడు
తాను 16 సార్లు ప్రత్యక్ష, పరోక్ష రీతిలో ఎన్నికల్లో పాల్గొన్నానని ఎప్పుడూ ఈ తరహాలో పోలింగ్‌ జరగలేదని మంత్రి అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. ఇవి పూర్తిగా విఫలమైన ఎన్నికలని, అత్యంత బాధ్యతారాహిత్యంగా నిర్వహించారని విమర్శించారు. ఈవీఎంలు తరచూ మొరాయించాయని, సగం ఓటింగ్‌ జరిగాక మరో యంత్రాన్ని మార్చారని అన్నారు. ఇందులో చాలా అనుమానాలు తలెత్తుతున్నాయని అభిప్రాయపడ్డారు. వరుసల్లో నిలబడిన వారికి కనీస సౌకర్యాలు కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోదీ, షా దర్శకత్వంలో ఈసీ :ప్రత్తిపాటి
మోదీ, షా దర్శకత్వంలో ఎన్నికల సంఘం పని చేసిందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. ఉన్నతాధికారులను మార్చడం వంటివి అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ అని ధ్వజమెత్తారు. నిజాయతీగా ప్రజలను మెప్పించి గెలవాలని హితవు పలికారు.

టీడీపీదే విజయం :దేవినేని
ఓటు వేసే సమయంలో ఈవీఎం పని చేయక తననే రెండు గంటలపాటు వేచి ఉండేలా చేశారని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆక్షేపించారు. ప్రధాన నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితి ఉందని ధ్వజమెత్తారు. జగన్‌, ప్రశాంత్‌ కిషోర్‌ ఆడుతున్న మైండ్‌ గేమ్‌ డ్రామాలు పనికిరావని కొట్టి పారేశారు. అభివృద్ధి, సంక్షేమ ప్రభుత్వానికే ప్రజలు పట్టం కట్టబోతున్నారని దేవినేని విశ్వాసం వ్యక్తం చేశారు.

పారదర్శక ఎన్నికలకు చొరవ చూపాలి :రామ్మోహన్‌ నాయుడు
కనీసం 50 శాతం వీవీప్యాట్‌లలో స్లిప్పుల లెక్కింపు జరపాల్సిందేనని తాము డిమాండ్‌ చేస్తున్నట్లు శ్రీకాకుళం టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్‌ నాయుడు స్పష్టం చేశారు. గతంలో పూర్తి పేపర్‌ బ్యాలెట్‌ విధానం ఉన్నప్పుడు 12 గంటల్లోనే లెక్కింపు పూర్తయ్యేదని వివరించారు. పారదర్శకమైన ఎన్నికల నిర్వహణ కోసం ఈసీ ఈదిశగా చొరవ చూపాలని కోరారు.