ఆంధ్రప్రదేశ్

ఈవీఎంల భద్రతపై గల్లా జయదేవ్‌ అనుమానాలు!

అమరావతి: గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని స్ట్రాంగ్ రూములను గుంటూరు తెదేపా ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ బుధవారం పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంల భద్రతపై పలు అనుమానాలు లేవనెత్తారు. సీసీ కెమెరాల పనితీరు సరిగా లేకపోయినా.. పర్యవేక్షణ సమర్థంగా లేకపోయినా ఓటింగ్‌ యంత్రాలను బయటకు తరలించే  అవకాశం ఉందని సందేహం వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా  ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా రాష్ట్రంలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందని వ్యాఖ్యనించారు. సమీక్షా సమావేశాల నిర్వహణలో ఏపీలో ఒకలా.. తెలంగాణలో మరోలా జరుగుతున్నా ఈసీ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో అర్థం కావడంలేదన్నారు.