అంతర్జాతీయం

ఈజిప్టులో ఉగ్రదాడి.. 10 మంది మృతి

సినాయీ ద్వీపకల్పంలోని ఓ చెక్‌ పాయింట్‌ వద్ద బుధవారం ఇస్లామిక్‌ ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని అధికారులు మీడియాకు తెలిపారు. ఆ దాడిలో 10 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని వారు వివరించారు. రంజాన్‌ సందర్భంగా ఈల్ అరీష్‌ నగరంలో ముస్లింలు ప్రార్థనలు జరుపుతున్న నేపథ్యంలో మరోవైపు ఈ రోజు ఉదయం చెక్‌ పాయింట్‌ వద్ద ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు చెప్పారు. మృతి చెందిన వారిలో ఇద్దరు అధికారులు, ఎనిమిది మంది సాధారణ పోలీసులు ఉన్నట్లు వారు నిర్ధరించారు.

ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు ఇప్పటివరకు ఏ ఉగ్ర సంస్థ ప్రకటించలేదు. చెక్‌ పాయింట్ వద్ద దాడి అనంతరం ఆయుధాలు ఉన్న ఓ వాహనాన్ని తీసుకొని ఉగ్రవాదులు తప్పించుకుపారిపోవాలని ప్రయత్నించారు. అయితే, వెంటనే ఓ యుద్ధ విమానంలో వారిని వెంటాడిన భద్రతా బలగాలు ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చాయని అధికారులు తెలిపారు. ఉత్తర సినాయీ ఆధారిత ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులతో ఈజిప్ట్ బలగాలు కొన్నేళ్లుగా పోరాడుతున్నాయి.