సినిమా

ఇలాంటి సినిమాను ఎవ్వరూ తీయలేదు

‘హిప్పీ’ లాంటి కాన్సెప్ట్‌తో ఇప్పటివరకూ సినిమా రాలేదని అంటున్నారు దర్శకుడు టీఎన్‌ కృష్ణ. ఆయన తెరకెక్కించిన ఈ చిత్రంలో కార్తికేయ కథానాయకుడిగా నటించారు. దిగంగనా సూర్యవంశీ, జజ్బా సింగ్‌ కథానాయికలు. గురువారం సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో టీఎన్‌ కృఫ్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సినిమా గురించి మాట్లాడుతూ..

‘నేను తమిళంలో తెరకెక్కించిన ‘సిల్లును ఒరు కాదల్‌’ సినిమా తెలుగులో ‘నువ్వు నేను ప్రేమ’గా విడుదలైంది. తెలుగులో నా తొలి సినిమా ‘హిప్పీ’. మనసుకు ఏది తోస్తే దానిని చేసుకుంటూ పోయే ఓ కుర్రాడి కథ ఇది. సినిమా చాలా బాగుంటుంది. నిర్మాత కూడా సంతృప్తిగా ఉన్నారు. ప్రస్తుతం సమాజంలో యువత ఎలా ఉంది అన్న కోణాలను ఈ సినిమాలో చూపించబోతున్నాం. ఇందులో ఓ సందేశం కూడా ఉంటుంది. జాన్‌ మెల్టన్‌ రాసిన ‘ప్యారడైజ్‌ లాస్ట్‌’ అనే నవల నుంచి స్ఫూర్తిపొంది ఈ సినిమాను తీశాను. పోస్టర్లలో లిప్‌ లాక్‌ సన్నివేశాలున్నప్పటికీ సందేశాత్మకంగా తెరకెక్కించాం. జేడీ చక్రవర్తి పాత్ర కూడా చాలా బాగుంటుంది. కేవలం ప్రేమే కాదు అన్ని అంశాలు ఉన్నాయి. ఎవ్వరూ ఇంతవరకు ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమాను తీయలేదు. ఈ సినిమాను కార్తికేయ చేస్తేనే బాగుంటుంది అనిపించింది’ అని తెలిపారు.