అంతర్జాతీయం

ఇరాన్‌..జాగ్రత్తగా ఉంటే మంచిది: ట్రంప్‌

అణుఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటించడం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జాగ్రత్తగా ఉండాలి’ అంటూ ఆ దేశాన్ని హెచ్చరించారు. ‘‘ఇరాన్‌.. జాగ్రత్తగా ఉండడం మంచింది. మీరు యురేనియం శుద్ధి చేయడానికి ఓ కారణం ఉంది, అదేంటనేది నేను ఇప్పుడు చెప్పను. కానీ అది మంచిది కాదు. జాగ్రత్తగా ఉండండి’’ అని న్యూజెర్సీలో విలేకర్లతో మాట్లాడుతూ ట్రంప్‌ అన్నారు. అంతకుముందు అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో మాట్లాడుతూ.. అణు ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లయితే దానికి బదులుగా ఇరాన్ మరిన్ని కఠిన ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు. ఇటీవల యురేనియం నిల్వలను పెంచుకున్నామని ఇరాన్‌ ప్రకటించిన సందర్భంలోనూ ట్రంప్‌ ‘నిప్పుతో చెలగాటమాడుతున్నారు’ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డ విషయం తెలిసిందే.

అణుఒప్పందం ప్రకారం ఇంధన అవసరాల కోసం యురేనియాన్ని 3.67సాంద్రతకు మించి శుద్ధి చెయ్యొద్దు. అయితే అమెరికా ఆంక్షల నుంచి కాపాడటానికి చైనా, ఫ్రాన్స్‌, జర్మనీ, రష్యా, యూకేలకు ఇరాన్‌ విధించిన 60 రోజుల గడువు ముగియడంతో తాము ఇక శుద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అదీ ఒప్పందంలో ఉన్న 3.67 సాంద్రత పరిమితిని దాటి 5శాతం సాంద్రత వరకు శుద్ధి చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒప్పందంలోని అంశాలను కాపాడటంతో యూరప్‌ దేశాలు విఫలమయ్యాయని వాటిపై ఒత్తిడి పెంచడం కోసమే ఇరాన్‌ ఈ చర్యలకు పూనుకుంటున్నట్లు అర్థమవుతోంది. ఇరాన్‌ ప్రకటనపై బ్రిటన్‌, ఫ్రాన్స్‌ తదితర దేశాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.