క్రీడలు

ఇప్పుడు మన్కడింగ్‌ చెయ్‌ చూద్దాం..

దిల్లీ : మన్కడింగ్‌.. ఈ ఐపీఎల్‌లో సంచలనం రేపింది. రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాట్స్‌మన్‌ బట్లర్‌ను పంజాబ్‌ కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మన్కడింగ్‌ ద్వారా పెవిలియన్‌కు పంపించాడు. అప్పట్నుంచి ఏదో ఒక మ్యాచ్‌లో మన్కడింగ్‌ అంశం అప్పుడప్పుడూ తొంగి చూస్తూనే ఉంది. అయితే, తీవ్ర విమర్శలకు దారి తీసిన మన్కడింగ్‌ ప్రస్తుతం క్రికెట్‌ అభిమానులకు నవ్వులు పూయిస్తోంది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మ్యాచ్‌లో కోహ్లీ ఘటన తర్వాత తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. అయితే, అది పూర్తి స్థాయి మన్కడింగ్‌ కాకపోయినా.. అభిమానులు మాత్రం తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే..

శనివారం రాత్రి దిల్లీ క్యాపిటల్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 164 పరుగుల లక్ష్యాన్ని దిల్లీ క్యాపిటల్స్‌కు నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో దిల్లీ బ్యాట్స్‌మెన్‌ క్రీజులోనే పాతుకుపోయారు. స్ట్రైకింగ్‌లో దిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(36), నాన్‌ స్ట్రైకింగ్ ఎండ్‌లో శిఖర్‌ ధావన్‌(51) ఉన్న సమయంలో తన మూడో ఓవర్‌ వేసేందుకు వచ్చాడు. అశ్విన్‌ ఆ ఓవర్‌లో మూడో బంతి వేయడానికి పరుగెత్తుకొచ్చి ఒక్కసారిగా ఆగిపోయాడు. నాన్‌ స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ధావన్‌కు మన్కడింగ్‌ గుర్తొచ్చి క్రీజులోనే నిల్చుండిపోయాడు. ఆ తర్వాత బంతి వేస్తున్న సమయంలో శిఖర్‌ ‘పరుగెత్తుతున్నా.. వీలైతే మన్కడింగ్‌ చెయ్‌’ అని అశ్విన్‌ వైపు చూస్తూ.. పరిగెత్తినట్లు నటించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఐపీఎల్‌ యాజమాన్యం తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది. ఈ మ్యాచ్‌లో దిల్లీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.