అంతర్జాతీయం

ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ రిజిస్ట్రేషన్‌ రద్దు

దిల్లీ: ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ రిజిస్ట్రేషన్‌ను కేంద్ర హోంశాఖ రద్దు చేసింది. విదేశీ నిధుల స్వీకరణలో నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

స్వచ్ఛంద సంస్థలు విదేశాల నుంచి విరాళాలు పొందాలంటే తప్పనిసరిగా ఫారిన్‌ కంట్రిబ్యూషన్‌(రెగ్యులేషన్‌) యాక్ట్‌(ఎఫ్‌సీఆర్‌ఏ) కింద రిజిస్టర్‌ చేసుకుని ఉండాలి. ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ కూడా రిజిస్టర్‌ అయ్యింది. అయితే ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనల ప్రకారం.. రిజిస్టర్‌ అయిన స్వచ్ఛంద సంస్థలు ఏటా తమ వార్షిక ఆదాయం, విదేశీ నిధుల వ్యయాలు, బ్యాలెన్స్‌ షీట్‌ వంటివి సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ విదేశాల నుంచి ఎలాంటి విరాళాలు రాకపోయినా.. ‘NIL’ రిటర్నులు దాఖలు చేయాల్సిందే.

అయితే గత ఆరేళ్లుగా ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ తమ ఆదాయ, వ్యయాలను వెల్లడించలేదు. దీనిపై గతంలో నోటీసులు జారీ చేసినప్పటికీ సంస్థ స్పందించలేదు. దీంతో ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తూ హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ కూడా ధ్రువీకరించింది. ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ను 1996లో స్థాపించారు. సుధా మూర్తి దీనికి ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు.