అంతర్జాతీయం

ఇతగాడు తినేవి చెగోడీలు కావు.. పురుగులు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: డిస్కవరీ ఛానెల్‌లో ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ కార్యక్రమాన్ని చూసి మీరూ ఆశ్చర్యపోయి ఉంటారు. అందులో బేర్‌బ్రిల్స్‌ తన జీవన విధానంలో భాగంగా వివిధ రకాల అటవీ జంతువులను ప్రాణాలతో ఉన్నప్పుడే తింటాడు. బ్రిల్స్‌ సాహస యాత్రలతో ప్రేరణ పొందిన ఓ యువకుడు చుట్టు పక్కల దొరికే కీటకాలు, బల్లులు తింటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

అసోం రాష్ట్రం డిబ్రుగఢ్‌ జిల్లా ధూలియాజన్‌ గ్రామానికి చెందిన రాజేష్‌.. చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బల్లులు, ఇతర కీటకాలు కానీ అతడి కంట పడ్డాయా? అంతే వాటిని వేటాడి మరీ పట్టుకుంటాడు. అమాంతం వాటిని నోట్లో వేసుకుంటాడు. చెగోడీలు తిన్నట్లుగా నమిలి తినేస్తాడు. ఇదంతా ఏమిటని రాజేశ్‌ను ప్రశ్నిస్తే.. తాను డిస్కవరీ ఛానెల్‌లో బేర్‌బ్రిల్స్‌ చేసే ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ విన్యాసాల నుంచి ప్రేరణ పొందానని చెబుతున్నాడు. ఇంత చేసినా తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలూ తలెత్తలేదని గొప్పగా చెబుతున్నాడు రాజేష్‌. మరో ఆశ్చర్యం ఏమిటంటే రాజేష్ భవిష్యత్‌లో ప్రాణాలతో ఉన్న పాములను సైతం తినేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడంట!!