ఆంధ్రప్రదేశ్

ఇకపై ఇంటికే పింఛను: సీఎం జగన్‌

 కడప గడప నుంచి నవరత్నాల అమలుకు మరోసారి శ్రీకారం చుడుతున్నామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నెల రోజుల లోపే వృద్ధాప్య పింఛనును రూ.2,250కు పెంచామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 5.4లక్షల పింఛన్లు మంజూరు చేయబోతున్నట్టు ప్రకటించారు.  సోమవారం ఆయన కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించిన రైతు దినోత్సవ సభలో ప్రసంగించారు. గత ప్రభుత్వం పాలనలో వైఫల్యాలను ఎత్తిచూపుతూనే తాము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ..‘‘సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి మీ తలుపు తట్టి పింఛను ఇస్తారు. అదే రోజు నుంచి గ్రామ వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను ఇంటికి వచ్చి వివరిస్తారు. గ్రామ వాలంటీర్లు ఎవరూ లంచం తీసుకోరు. ఎవరైనా లంచం తీసుకుంటే నేరుగా సీఎం కార్యాలయానికే ఫిర్యాదు చేయవచ్చు. ఇక నుంచి వైఎస్‌ఆర్‌ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుతాం. ఈ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసమే ఉంది. గత ప్రభుత్వ హయాంలో 2014-15లో పింఛన్లకు రూ.3,378 కోట్లు ఖర్చు చేయగా.. 2015-16లో రూ.5,201 కోట్లు, 2016-17లో 5,270 కోట్లు, 2017-18లో రూ.5,436 కోట్లు ఖర్చు చేశారు. కానీ.. 2018-19లో మాత్రం ఎన్నికలకు నాలుగు నెలల ముందు రూ.8,234 కోట్లు ఖర్చు చేశారు. నెల తిరగకుండానే మా ప్రభుత్వం పింఛన్ల కోసం రూ.15,675 కోట్లు ఖర్చు చేసింది’’ అని వివరించారు.

సున్నా వడ్డీకే పంట రుణాలు
‘‘రైతుల పంట రుణాల కోసం కేవలం ఈ ఏడాదికి రూ.84వేల కోట్లు రుణాలు అందించాలని నిర్ణయించాం. పంట రుణాలు తీసుకున్న రైతులు నిర్ణీత గడువులోగా తిరిగి చెల్లిస్తే వాటిపై ఏమాత్రం వడ్డీ చెల్లించనక్కర్లేదు. జూన్‌ 1 నుంచి జులై 7 వరకు కడప జిల్లాలోనే రూ.1000 కోట్ల పంట రుణాలు ఇచ్చామని చెప్పడానికి గర్వపడుతున్నా. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు పగటిపూటే 9 గంటల విద్యుత్‌ సరఫరాకు చర్యలు తీసుకున్నాం. నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకుంటాం. అన్నదాతలకు తోడుగా వైఎస్‌ఆర్‌ భరోసా పథకం తీసుకొచ్చాం. వచ్చే ఏడాది ఇవ్వాల్సిన ఈ పథకాన్ని 7 నెలల ముందే ఇస్తున్నాం. రాష్ట్రంలో 70శాతం మంది రైతులకు హెక్టారులోపు పొలమే ఉంది. రైతు భరోసా కింద 70లక్షల మంది రైతులకు రూ.8,750 కోట్లు ఇవ్వబోతున్నాం. తుపాన్లు వచ్చినప్పడు రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి రాయితీ ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఇప్పుడు మేం ఇస్తున్నాం. వ్యవసాయ ట్రాక్టర్లపై రోడ్డు పన్ను రద్దు చేశాం. రైతు భరోసా వంటి పథకం దేశంలోనే ఎక్కడా లేదు. వ్యవసాయంలో దశ, దిశ ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నాం. అధికారంలోకి రాగానే పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేశాం. అరటి రైతుల గురించి గత ప్రభుత్వం ఆలోచించలేదు. రైతుకు జరగరానిది జరిగితే రూ.7 లక్షలు చెక్కు అందిస్తాం’’ అని భరోసా ఇచ్చారు.