అంతర్జాతీయం

ఇంట్లోనే ఉంటాం.. ఆన్‌లైన్‌లో ఓటు వేస్తాం..

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం : ప్రజాస్వామ్యంలో ఓటు అతి విలువైనది. లక్షల కోట్ల ప్రజాధనానికి సంరక్షకులుగా వ్యవహరించే ప్రజాప్రతినిధులను ఆచితూచి ఎన్నుకోవాల్సివుంటుంది. అయితే దేశంలో ఎన్నికల ప్రక్రియలో దాదాపు30 శాతం మంది దూరంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పోలైన ఓట్లలో ఎవరు ఎక్కువ ఓట్లు సాధిస్తే వారే ఎన్నికవుతుండటం గమనార్హం. గ్రామీణప్రాంతాల్లో ఎక్కువగా ఓటింగ్‌ జరిగితే విద్యాధికులు అధికంగా ఉండే నగరప్రాంతల్లో మాత్రం ఓటింగ్‌ తక్కువ శాతం నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. అయితే నూతన టెక్నాలజీ, ఇంటర్నెట్‌రంగం కొత్తపుంతలు తొక్కుతున్న తరుణంలో ఆన్‌లైన్‌ ద్వారా ఓటింగ్‌ ను ఐచ్ఛికంగా ఉంచాలని డిమాండ్‌ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ విధానాన్ని యూరప్‌లోని చిన్నదేశమైన ఎస్టోనియాలో అమలు చేస్తుండటం విశేషం.

99 శాతం సేవలు ఆన్‌లైన్‌లోనే..
ఎస్టోనియాలో అనేక ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తుంటారు. వివాహం, విడాకులు, ఇళ్ల కోనుగోలు-అమ్మకాలు తప్ప ఇతర సేవలను ప్రజలు ఆన్‌లైన్‌ ద్వారా పొందుతున్నారు. ఈ విధానంతో కోట్లాది పనిగంటలు ఆదా అయినట్టు తెలుస్తోంది.

ఐ- ఓటింగ్‌ అంటే..
దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటుహక్కు లభిస్తుంది. 2007 నుంచే ఆ దేశంలో ఇంటర్నెట్‌ ఓటింగ్‌ ను నిర్వహిస్తున్నారు. అయితే అనేకమంది ప్రజలు పోలింగ్‌ బూత్‌లకు వచ్చేందుకు ఆసక్తిచూపించడంతో ఆ పద్ధతిని ఎత్తివేయలేదు. ఈ నెలలో ఎస్టోనియాలో జరిగిన  పార్లమెంటరీ ఎన్నికల్లో దాదాపు 46 శాతంమంది ప్రజలు ఇంటర్నెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఇలా ఓటు వేయాలి..
ఇంటినుంచే ఓటు వేయాల్సిన ఓటర్లు తొలుత తమ ఓటర్‌ ఐడీని మొబైల్‌ఫోన్‌ నెంబరుతో అనుసంధానించుకోవాలి. ఓటింగ్‌ వేసేందుకు ముందుగా ఎన్నికల వెబ్‌సైట్‌లోకి వెళ్లి లాగ్‌ అవగానే మన మొబైల్‌ నెంబరుకు ఓటీపీ వస్తుంది. దీనిని మళ్లీ ఎంటర్‌ చేస్తే ఎలక్ట్రానిక్‌ బ్యాలట్‌పత్రం కనిపిస్తుంది. మనకు నచ్చిన అభ్యర్థి గుర్తుపై ఓటు వేసి సబ్‌మిట్‌ చేయగానే ఓటును వినియోగించుకున్నట్టు సమాచారం వస్తుంది. ఇందులో మరో సౌలభ్యాన్ని ఏర్పాటు చేశారు. పోలింగ్‌ రోజుకంటే కొన్ని రోజుల ముందు నుంచే మనం ఓటును వినియోగించుకోవచ్చు. పోలింగ్‌ రోజున సమయం ముగిసేవరకు మనం ఓటును మార్చుకునే అవకాశముంది.

మనదేశంలోనూ ప్రవేశపెట్టాలి..
దేశంలో ఈవీఎంలను ఎంతో కాలం క్రితమే ప్రవేశపెట్టిన ఎన్నికల సంఘం ప్రపంచ ఎన్నికల చరిత్రలో నూతన అధ్యాయానికి నాందిపలికింది. ఇదే తరహాలో భవిష్యత్‌లో వీలయినంత త్వరగా ఆన్‌లైన్‌ ఓటింగ్‌ విధానాన్ని తీసుకువస్తే దేశంలో పోలింగ్‌ శాతం మరింత పెరిగే అవకాశముంది. దొంగఓట్లను నివారించడంతో పాటు రిగ్గింగ్‌ను అడ్డుకునే వీలు కలుగుతుంది.