తెలంగాణ

ఇంటెలిజెన్స్ హెచ్చ‌రిక‌: తెలంగాణ‌లో టెన్ష‌న్ టెన్ష‌న్

తెలంగాణ‌లో మ‌ళ్లీ త‌మ ఉనికిని చాటుకునేందుకు మావోయిస్టులు సిద్ధ‌మ‌వుతున్నారా? ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అర‌కు ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ‌ల‌ను హ‌త‌మార్చిన‌ట్లే ఇక్క‌డ కూడా ప్ర‌జా ప్ర‌తినిధుల హ‌త్య‌కు కుట్ర ప‌న్నుతున్నారా? ఇప్ప‌టికే త‌మ ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించుకున్నారా? ఈ ప్ర‌శ్న‌ల‌న్నింటికీ అవున‌నే స‌మాధాన‌మే చెబుతున్నాయి ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు. తెలంగాణ‌లో ప్ర‌ధానంగా టీఆర్ఎస్‌, బీజేపీ నేత‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకొని మావోయిస్టులు దాడుల‌కు దిగే ముప్పుంద‌ని హెచ్చ‌రిక‌లు విడుద‌ల‌వుతున్నాయి.
తెలంగాణ‌లో భ‌ద్రాద్రి-కొత్త‌గూడెం, జ‌య‌శంక‌ర్-భూపాల‌ప‌ల్లి, కుమ్రంభీం, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో మావోయిస్టుల ప్రాబ‌ల్యం ఎక్కువ‌. మావోయిస్టు సానుభూతిప‌రుల సంఖ్య కూడా అధిక‌మే. ఈ జిల్లాల్లోని ఏజెన్సీల్లో మావోయిస్టులు అర‌కు త‌ర‌హా దాడుల‌కు ప్ర‌య‌త్నించే అవ‌కాశ‌ముంద‌ని కేంద్ర‌, రాష్ట్ర ఇంటెలిజన్స్ వ‌ర్గాలు తాజాగా హెచ్చ‌రిక‌లు జారీ చేశాయి. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ఎన్నిక‌ల హ‌డావుడి నెల‌కొంది. ఎన్నిక‌ల షెడ్యూల్ ఇప్ప‌టికే విడుద‌లైన నేప‌థ్యంలో అభ్య‌ర్థులు ప్ర‌చార జోరును పెంచ‌నున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకున్నారు. అయితే, ప్ర‌చార ప‌ర్వ‌మే అద‌నుగా మావోయిస్టులు విజృంభించే అవ‌కాశ‌ముంద‌ని నిఘావ‌ర్గాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. ఏజెన్సీల‌కు వ‌చ్చే నేత‌ల‌ను అప‌హ‌రించే ముప్పుంద‌ని సూచిస్తున్నాయి. ప్ర‌ధానంగా మహారాష్ట్ర, ఛత్తీసగఢ్‌లతో సరిహద్దును పంచుకుంటున్న ప్రాంతాలు, గోదావరి తీర ప్రాంతాలు, కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద నిఘా ఏర్పాటు చేయాలంటూ అప్ర‌మ‌త్తం చేశాయి.
తెలంగాణ‌లో న‌క్స‌లిజంను నిర్మూలించామ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప‌లుమార్లు ప్ర‌క‌టించింది. తాజాగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఈ త‌ర‌హా ప్ర‌క‌ట‌నే చేశారు. వ‌చ్చే రెండు, మూడేళ్ల‌లో మ‌న దేశంలో న‌క్స‌లిజం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంద‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలో త‌మ ఉనికిని ప్ర‌శ్నిస్తున్న‌వారి పార్టీ నేత‌ల‌పైనే తొలుత దాడికి చేయాల‌ని.. త‌ద్వారా త‌మ ఉనికిని ఘ‌నంగా చాటుకున్న‌ట్ల‌వుతుంద‌ని మావోయిస్టులు భావిస్తున్న‌ట్లు నిఘావ‌ర్గాలు చెబుతున్నాయి. అందుకే టీఆర్ఎస్‌, బీజేపీ నేత‌లు అత్యంత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని.. పోలీసుల‌ ర‌క్ష‌ణ లేకుండా ఏజెన్సీల్లోకి వారు వెళ్లొద్ద‌ని