తెలంగాణ

ఇంటర్‌ వ్యవహారంపై రాష్ట్రపతిని కలుస్తాం!

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలపై త్వరలోనే రాష్ట్రపతిని కలుస్తామని అఖిలపక్ష నేతలు ప్రకటించారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేసే వరకు తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద నిరసన దీక్ష చేపట్టారు. విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలేనని ఈ సందర్భంగా పలువురు నేతలు విమర్శించారు. కేసీఆర్‌ సర్కార్‌ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆరోపించారు. తెరాస ప్రభుత్వ నిరంకుశ ధోరణుల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అఖిలపక్ష నేతలు ఆక్షేపించారు.

కీలక సమయంలో విహార యాత్రలా?
ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకల సమస్యకు పరిష్కారం చూపకపోతే ప్రభుత్వంపై సీరియస్‌గా స్పందిస్తామని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. త్వరలోనే రాష్ట్రపతిని కలవనున్నట్టు ఆయన స్పష్టంచేశారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా సాధించడమే తమ లక్ష్యమన్నారు. మూడు రోజుల్లో స్పందించకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. రెండు నెలలు దిద్దాల్సిన పేపర్లను నెలలోనే పూర్తిచేశారని ఆయన ఆరోపించారు. ఇంటర్‌ ఫలితాల డేటాను తప్పుల తడకగా పొందుపరిచారని మండిపడ్డారు. ఫలితాల్లో అవకతవకలకు బాధ్యతగా విద్యాశాఖ మంత్రిని బర్త్‌రఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని కోరారు. కీలక సమయంలో విహార యాత్రలకు సీఎం వెళ్లారని మండిపడ్డారు. ప్రభుత్వంపై నైతిక ఒత్తిడి మాత్రమే తీసుకురాగలమని.. ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రభుత్వం తమ మొరను ఆలకించడంలేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

అవన్నీ సర్కారీ హత్యలే!
ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకల ఘటనకు నూటికి నూరుపాళ్లు సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని సీపీఐ జాతీయ నేత నారాయణ డిమాండ్‌ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలన్నీ సర్కారీ హత్యలే తప్ప ఇంకొకటి కాదన్నారు. ఆ పాపం నుంచి తనను కాపాడాలనే కేసీఆర్‌ దేవుళ్ల చుట్టూ తిరుగుతున్నారని నారాయణ వ్యాఖ్యానించారు. బాధిత కుటుంబాల వద్దకు కేసీఆర్‌ వెళ్లి ముక్కు నేలకురాసి క్షమాపణ చెబితేనే ఆ దేవుడైనా క్షమిస్తాడని అన్నారు.