తెలంగాణ

ఇంటర్‌ ఫెయిల్‌.. విద్యార్థిని ఆత్మహత్య

ఎడపల్లి: నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలంలోని ఏఆర్‌పీ క్యాంప్‌లో గురువారం రాత్రి ఇంటర్మీడియట్‌ విద్యార్థిని ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గోపాల కృష్ణ కుమార్తె వెన్నెల(18) ఇంటర్మీడియట్‌ చదువుతోంది. గురువారం వెలువడిన ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో వెన్నెల రెండు సబ్జెక్టులు తప్పడంతో గురువారం రాత్రి ఎలుకల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం వేకువజామున మృతిచెందినట్లు ఎడపల్లి ఎస్సై రామునాయుడు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థిని మృతితో కుటుంబ సభ్యులు కన్నీమున్నీరుగా విలపిస్తున్నారు.