ఆంధ్రప్రదేశ్తెలంగాణ

ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం…

 

  • నేటి నుంచి సెల్‌ఫోన్ల వాడకం నిషేధం
  • సిబ్బందితోపాటు ఫ్లయింగ్‌ స్క్వాడ్లకూ వర్తింపు

 

హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ పరీక్షల విధులు నిర్వర్తించే పర్యవేక్షకులు, సిట్టింగ్‌ స్క్వాడ్ల సహా ఫ్లయింగ్‌ స్క్వాడ్లు సైతం పరీక్షలు ముగిసే వరకు సెల్‌ఫోన్లు వాడరాదని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశించారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం నుంచి మొదలవుతున్న నేపథ్యంలో మంత్రి ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్‌తో సమీక్షించారు. వాట్సాప్‌ ద్వారా గందరగోళం ఏర్పడే అవకాశం ఉన్నందున సిబ్బంది మొబైల్‌ ఫోన్‌ వాడకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. జిరాక్స్‌ కేంద్రాలపై నిఘా ఉంచాలన్నారు.

హాల్‌టికెట్లలో తప్పులు..!
ఇంటర్మీడియట్‌ హాల్‌ టిక్కెట్లలో పలు తప్పులు దొర్లడంతో వందలాది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. దీనికి కారణం మీరంటే మీరంటూ ఇంటర్‌బోర్డు, కళాశాలల యాజమాన్యాలు పరస్పరం వేలెత్తి చూపుతున్నాయి. హాల్‌టిక్కెట్లతో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి మంగళవారం ఇంటర్‌బోర్డు కార్యాలయానికి వచ్చి తప్పులు సరి చేయించుకున్నారు. ఒకరోజు ముందే హాల్‌టిక్కెట్లను చూసుకున్న విద్యార్థులు ద్వితీయ భాష సబ్జెక్టుగా ఒకదానికి బదులు మరొకటి ముద్రణ కావడం, ఆంగ్లం బదులు తెలుగు మాధ్యమమని ఉండటం, కొందరు ఏయే సబ్జెక్టులు రాస్తారో ముద్రించకుండా ఖాళీగా ఉంచడం, హాల్‌టికెట్లపై ఫొటోలు ముద్రించకపోవడం తదితర కారణాలతో ఆందోళనకు గురయ్యారు.

ఇంటర్‌ స్పాట్‌ను బహిష్కరిస్తాం
మోడల్‌ స్కూళ్లలో పనిచేస్తున్న శాశ్వత ఉపాధ్యాయులను కాదని ఒప్పంద అధ్యాపకులకు ప్రాధాన్యమిస్తూ ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని మోడల్‌ స్కూల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు, ప్రధాన కార్యదర్శి కె.నగేష్‌ తెలిపారు. ఆ ఉత్తర్వులను రద్దుచేయకుంటే ఇంటర్‌ మూల్యాంకనాన్ని బహిష్కరిస్తామన్నారు.