క్రీడలు

ఇంకో పిచ్‌పై 150 చేసేవాడిని: పుజారా

మెల్‌బోర్న్‌: ఎంసీజీ కాకుండా మరో పిచ్‌ అయితే వేగంగా పరుగులు చేసేవాడినని టీమిండియా నయావాల్‌ ఛెతేశ్వర్‌ పుజారా అన్నాడు. సమయం పెరుగుతున్నా కొద్ది వికెట్‌ తన స్వభావం మార్చుకుంటోందని వెల్లడించాడు. ‘పరిస్థితిని బట్టి పిచ్‌ స్వభావాన్ని అనుసరించి బ్యాటింగ్‌ చేయాలి. ఈ పిచ్‌పై పరుగులు చేయాలంటే ప్రతి బ్యాట్స్‌మన్‌ ఎక్కువ బంతులు ఆడాలి. మరో వికెటైతే నేను 140-150 పరుగులు చేసేవాడిని. టెస్టు క్రికెట్‌లో బ్యాటింగ్‌ చేసేటప్పుడు పిచ్‌ను, పరిస్థితిని అధ్యయనం చేసి ఆడాలి’ అని పుజారా పేర్కొన్నాడు. ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను 443/7 వద్ద డిక్లేర్‌ చేసిన సంగతి తెలిసిందే.

‘పిచ్‌పై పరుగులు చేయడం కష్టంగా ఉంది. తొలి రెండు రోజుల్లో చేసిన పరుగులు చాలా తక్కువ. ఒక రోజులో 200 చేయడం కష్టమైన పని. ఈ ప్రకారం మేం భారీ స్కోరు చేసినట్టే. పిచ్‌ క్రమంగా జీవం కోల్పోతోంది. అసహజంగా బౌన్స్‌ అవుతోంది. నిన్నటికి, ఈ రోజుకే భారీ తేడా కనిపించింది. మూడో రోజు నుంచి బ్యాటింగ్‌ చేయడం ఎంతో కష్టం. మా బౌలర్లు అద్భుతంగా బంతులు వేస్తున్నారు. ప్రత్యర్థి బ్యాటింగ్‌ చేసేటప్పుడు కచ్చితంగా ఇబ్బంది పడుతుంది. పిచ్‌ వేగాన్నీ తట్టుకోలేకపోయా. నాలుగైదు బంతులు చేతి వేళ్లను తాకాయి. అవి షార్ట్‌పిచ్‌ బంతులూ కావు. తక్కువ బౌన్స్‌తో ఇబ్బంది లేదు. బౌన్స్‌లో వైవిధ్యం ఉంటే మాత్రం ఏం చేయలేం. కమిన్స్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. వైవిధ్యంగా బౌన్స్‌ చేశాడు’ అని పుజారా అన్నాడు. శతకం సాధించిన పుజారా మ్యాచ్‌లో విరాట్‌ (82)తో కలిసి 170 పరుగుల విలువైన భాగస్వామ్యం అందించాడు.