జాతీయం

ఆ విషయంలో పాక్‌బౌలర్లు విఫలమయ్యారు:సచిన్‌

ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియాతో జరిగిన పోరులో పాకిస్థాన్‌ వైఫల్యాన్ని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ బయటపెట్టాడు. భారత్‌ X పాక్‌ మ్యాచ్‌ అనంతరం ఓ మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘పాకిస్థాన్‌పై టీమిండియా అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణించింది. ఇది ఎవరూ కాదనలేని నిజం. గణంకాల పరంగా చూసినా ఇదే విషయం స్పష్టమవుతోంది. భారత్‌ ఎంత సమయోచితంగా వాళ్లని ఓడించిందో అందరూ చూశారు’ అని పేర్కొన్నాడు.

కాగా పాక్‌ బౌలర్లు ఆదిలోనే భారత ఓపెనర్లని ఔట్‌చేయడంలో విఫలమయ్యారని సచిన్‌ అన్నాడు. ముందే వికెట్లు తీయకపోతే భారత్‌ అలవోకగా 325 పరుగులు చేస్తుందని తాను ముందే చెప్పినట్లు తెలిపాడు. రోహిత్‌ శర్మ (140), కేఎల్‌ రాహుల్‌(57) రాణించడంతో తొలి వికెట్‌కు అమూల్యమైన 136 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యం లభించిందని, ప్రపంచకప్‌లో మన జట్టుకు పాకిస్థాన్‌పై ఇదే అత్యుత్తమ భాగస్వామ్యమన్నాడు. మంచి ఓపెనింగ్‌ లభిస్తే తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్‌కు భారీ స్కోర్‌ సాధించేందుకు వీలుంటుందని, అలాగే రాహుల్‌ ఔటయ్యాక కోహ్లీ భాగస్వామ్యం, పాండ్య దూకుడు కలిసి వచ్చాయని లిటిల్‌ మాస్టర్‌ వివరించాడు.

తొలి ఇన్నింగ్స్‌ ఆఖర్లో వర్షంరావడం వల్ల టీమిండియా లయ తప్పి పరుగులు చెయ్యలేకపోయిందని, లేకుంటే మరో పదిహేను పరుగులు అదనంగా వచ్చేవని తెలిపాడు. కోహ్లీసేన విరామం లేకుండా ఫైనల్స్‌ వరకూ దూసుకుపోవాలని ఆకాంక్షించాడు. ఇక జూన్‌ 30న ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగే మరో కీలక మ్యాచ్‌ కోసం తాను ఎదురు చూస్తున్నానని చెప్పాడు. ప్రస్తుత టీమిండియా మంచి ఫామ్‌లో ఉందని, ఇలాగే ఆడి ఫైనల్స్‌లో అద్భుతం చేయాలని ఆశాభావం వ్యక్తంచేశాడు.