జాతీయం

ఆ విషయంలో ఈసీకి ఉన్న అభ్యంతరమేంటి?

దిల్లీ: 5 శాతం వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపులో ఏమైనా సమస్యలు ఎదురైతే ఆ అసెంబ్లీ నియోజకవర్గంలోని మొత్తం స్లిప్పులను లెక్కించాలని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో ఈసీకి ఉన్న అభ్యంతరమేంటని ఆయన ప్రశ్నించారు. ఎన్డీయేతర పక్షాల నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. గత కొన్ని రోజులుగా ఈవీఎంల పనితీరుపై ఈసీకి ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. పోలింగ్‌లో పారదర్శకత, ప్రజల్లో విశ్వాసం కల్పించడం ఎన్నికల సంఘం బాధ్యత అని చెప్పారు. ఈ విషయంలో మాజీ ఎన్నికల కమిషనర్లు సైతం సమర్ధిస్తున్నారన్నారు. బాధ్యతగల రాజకీయ పార్టీ ప్రతినిధులుగా తాము పోరాడుతున్నామని చెప్పారు. ‘‘ఒక్క రక్త పరీక్షతో శరీరంలో ఉన్న జబ్బు బయటపడదు. మొత్తం స్కానింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా అలాంటిదే’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. భవిష్యత్‌ కార్యాచరణపై అన్ని విపక్ష పార్టీలతో మళ్లీ చర్చించి ఎలా నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈవీఎంల్లో లోపాలున్నాయని.. ఏ పార్టీకి ఓటు వేసినా ఒకే పార్టీకి పడుతోందని ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ తెలిపారు. ఈవీఎం, వీవీప్యాట్‌ స్లిప్పుల్లో తేడా వస్తే అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మొత్తం ఓట్లు లెక్కించాలని డిమాండ్‌ చేసినట్లు చెప్పారు. గత నెలన్నర రోజులుగా రాతపూర్వకంగా అనేక ఫిర్యాదులు చేసినా ఈసీ స్పందించడం లేదని కాంగ్రెస్‌కు చెందిన మరో నేత అభిషేక్‌ మను సింఘ్వీ ఆరోపించారు. 100శాతం వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలనేదే తమ ప్రధాన డిమాండ్‌ అని ఆయన వివరించారు.